గురుకులాల్లో ప్రవేశాలకు పిలుపు
నెల్లిమర్ల: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల్లో మొత్తం 440 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలను అధికారులు తాజాగా ప్రకటించారు. నెల్లిమర్ల బాలికలు, గజపతినగరం బాలురు, గంట్యాడ బాలికలు, బొబ్బిలి బాలుర పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశానికి 80 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. నెల్లిమర్ల మత్స్యకార బాలురు, విజయనగరం బాలురు, కొత్తవలస బాలికల పాఠశాలల్లో 40 చొప్పున సీట్లున్నాయి. నెల్లిమర్ల బాలికల కళాశాలలో ఇంటర్‌లో ప్రవేశానికి 180 సీట్లు కేటాయించారు. వాటిలో ఎంపీసీ–60, బైపీసీ –40, సీఈసీ–40, ఎంఈసీ–40 సీట్లు కేటాయించారు.
ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు
గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి, ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు ప్రతిభ పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించేవారు. 4వ తరగతి స్థాయిలో పరీక్ష ఉంటుంది. తెలుగు–10, ఇంగ్లిష్–10, లెక్కలు–15, సైన్స్, సోషల్ కలిపి 15 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్షకు రెండు గంటల సమయం కేటాయిస్తారు. విద్యార్థులు జవాబులను ఓఎంఆర్ షీట్‌లో గుర్తించాల్సి ఉంటుంది. జిల్లా అంతా ఒక యూనిట్‌గా ప్రవేశాలకు ఎంపిక నిర్వహిస్తారు.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
జిల్లాలోని ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలు పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశాం. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదోతరగతికి, పదోతరగతి విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశానికి ఈ నెల 4నుంచి మార్చి 4 తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ కేబీబీ రావు,
గురుకులాల జిల్లా కన్వీనర్, విజయనగరం
దరఖాస్తుకు అర్హతలు
గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. జిల్లాలో ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరంతరాయంగా (2024–25, 2025–26) చదివి ఉండాలి. బీసీ, ఈబీసీ విద్యార్థులు 01–09–2015–31–08–2017 మధ్య జన్మించి, 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01–09–2014– 31–08–2018 మధ్య జన్మించి, 9 నుంచి 13 సంవత్సరాల వయసు వారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల సంవత్సర ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించరాదు. అర్హులు రూ.100 ఫీజు చెల్లించి హెచ్‌టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంజేపీఏపీ బీసీ గురుకులాల్లో
ప్రవేశాలకు ప్రకటన విడుదల
జిల్లాలో మూడు బాలికలు, నాలుగు బాలుర పాఠశాలలు
440 మంది విద్యార్థులకు ఐదో
తరగతిలో ప్రవేశాలకు అవకాశం
నెల్లిమర్లలో ఇంటర్‌లో ప్రవేశానికి
180 సీట్లు
నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
గురుకులాల్లో ప్రవేశాలకు పిలుపు
గురుకులాల్లో ప్రవేశాలకు పిలుపు


