పేదలను మోసం చేసిన చంద్రబాబు
చీపురుపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలను అమలుచేయకుండా రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని, ఆయన ఉత్తుత్తి హామీల పుణ్యమా అని పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మండలం గొల్లలములగాం గ్రామంలో మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియామక ప్రక్రియలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. ఎంతో మంది అర్హత కలిగిన లబ్ధిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో ప్రతీ ఆరు నెలలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కొత్త పింఛన్లు మంజూరుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తామన్నారని, ఇప్పుడు 60 ఏళ్లు దాటిన వారు వేలాదిమంది ఉన్నా పింఛన్ మంజూరుకాని పరిస్థితి నెలకొందన్నారు.
వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇచ్చారా?
గ్రామ వలంటీర్లకు నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పారని... జీతం ఇస్తున్నారా లేదా అంటూ గతంలో పనిచేసిన వలంటీర్లను ఆయన ప్రశ్నించారు. దీనికి వలంటీర్లు మాట్లాడుతూ రూ.10 వేలు జీతం లేదు సరికదా ఉన్న ఉద్యోగం కూడా లేదు సార్ అంటూ బదులిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు లేదన్నారు. వలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు పేదలకు మెరుగైన సౌకర్యాలు అందాయన్నారు. కార్యక్రమంలో బొత్స కుమార్తె బొత్స అనూష, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వైస్ ఎంపీపీ కరుమజ్జి వెంకటరమణమ్మ, సర్పంచ్ కరుమజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
18 నెలల్లో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు
వలంటీర్లకు ఉపాధిలేకుండా చేశారు..
పింఛన్ లబ్ధిదారుల కోసం పోరాటం చేస్తాం
శాసన మండలి విపక్ష నేత
బొత్స సత్యనారాయణ


