పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా.. నన్నే పక్కన పెడతారా..? | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా.. నన్నే పక్కన పెడతారా..?

Oct 20 2023 1:20 AM | Updated on Oct 20 2023 1:12 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధిష్టానం వద్ద మాట చెల్లడం లేదు.. స్థానికంగా పరువు దక్కడం లేదు. కమిటీలో స్థానం దక్కక, నమ్ముకున్న నాయకుడు పట్టించుకోక టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు పరిస్థితి కళావిహీనంగా మారింది. ఒకప్పుడు అగ్రనేతగా వెలిగిన ఆయన ప్రభ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. చంద్రబాబు జైలుకెళ్లాక లోకేష్‌ వద్ద కళా మాట చెల్లుబాటు అవుతుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురవుతోంది. అచ్చెన్నాయుడు కంటే తనకే పెద్దపీట వేస్తారని కళా కూడా భావించినా.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌.

కమిటీల్లో దక్కని చోటు..
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత ఆ పార్టీని నడిపించే బాధ్యతలను కొందరు సీనియర్లు తీసుకుంటున్నారు. జైలులో ఉన్న చంద్రబాబు డైరెక్షన్‌లో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యక్షంగా ఉండని కారణంగా పార్టీ కార్యక్రమాలు, మిత్రపక్షమైన జనసేనతో సమన్వయం చేసుకునేందుకు రెండు కమిటీలు కూడా నియమించారు. పొలిటకల్‌ యాక్షన్‌ కమిటీలో యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్‌, పయ్యావుల కేశవ్‌, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామునాయుడు, నక్కా ఆనంద్‌బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్రయాదవ్‌, నారా లోకేష్‌లను సభ్యులుగా నియమించారు.

జనసేనతో సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌ పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యలను సభ్యులుగా నియమించారు. ఇంత మంది సీనియర్లను గుర్తించినా పార్టీ అధ్యక్షుడిగా ఇదివరకు పనిచేసిన కళా వెంకటరావును మాత్రం విస్మరించారు. ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం దక్కలేదు. పార్టీ కీలక మీటింగ్‌లకు కూడా ఆయనకు ఆహ్వానాలు అందడం లేదు. దీంతో ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేననే భావన అనుచరుల్లో వ్యక్తమవుతోంది.

అంతర్మధనం మొదలు..
కళా వెంకటరావుకు ప్రాధాన్యత తగ్గించడంతో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. కీలక కమిటీల్లో చోటు దక్కకపోవడంతో తన ప్రాబల్యం తగ్గిపోయిందని మధన పడుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సన్నిహిత వర్గాల వద్ద, తెలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆవేదన చెందినట్టు తెలిసింది. తన కోసం నాలుగు ముక్కలు మాట్లాడండి.. రాయండి అని కూడా కోరినట్టు ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

మొత్తానికి కళా విహీనాన్ని కళ్ల ముందు చూస్తున్నామని ఆయన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ కేడర్‌ ఆనంద పడుతుండగా.. తమ నాయకుడికి ఈ పరిస్థితేంటని, ఎందుకిలా జరుగుతుందని తన అనుచరవర్గం బాధపడుతోంది. రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ చంద్రబాబు జైలుకెళ్లిన పరిణామాలు ఆందోళన కలిగిస్తుంటే, ఇక్కడ మాత్రం తమ నాయకుడికి కీలక సమయంలో గుర్తింపు దక్కలేదని ఆయన వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

పట్టు తగ్గడమే కారణమా?
పొలిట్‌ బ్యూరో, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకటరావును కనీసం గుర్తించకపోవడం వెనక ఆయన పట్టు తగ్గిపోవడమే కారణంగా టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు జైలుకెళ్లాక లోకేష్‌ సన్నిహితుడిగా ముద్రపడిన కళా వెంకటరావుకు ప్రాధాన్యత పెరుగుతుందనుకుంటే.. అనూహ్యంగా తగ్గిపోవడం చూసి కళా పరిస్థితిపై పార్టీ శ్రేణులు బేరీజు వేసుకుంటున్నాయి.

సొంత నియోజకవర్గమైన రాజాంలో సీన్‌ లేకపోవడం, వలస వచ్చిన ఎచ్చెర్లలో కేడర్‌ పట్టించుకోకపోవడం, జనాల్లో ఆదరణ కొరవడటంతో కళా పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. మాట చాతుర్యం, బయట డాబు తప్ప ఇంకేమీ లేదని అటు కేడర్‌కు, ఇటు అధిష్టానానికి అర్థమైపోయినట్టు ఉంది. నియోజకవర్గంలో నెట్టుకురాలేని నాయకుడిని రాష్ట్రస్థాయిలో గుర్తించడం సరికాదనే అభిప్రాయమో మరేంటో తెలియదు గాని పార్టీ కీలక సమయంలో ఆయనకేమాత్రం స్థానం కల్పించలేదు. పార్టీలో పాత్ర పోషించే అవకాశం ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement