ఓటుహక్కుపై పోటీల విజేతలకు ధ్రువపత్రాల అందజేత | - | Sakshi
Sakshi News home page

ఓటుహక్కుపై పోటీల విజేతలకు ధ్రువపత్రాల అందజేత

Nov 27 2026 12:50 AM | Updated on Nov 27 2026 12:50 AM

మహారాణిపేట: ఓటుహక్కుకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.డి. అనిత ధ్రువపత్రాలు అందజేశారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలను అభినందించి ధ్రువపత్రాలు అందించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నవంబర్‌ 2 నుంచి 20వ తేదీ వరకు మూడు దశల్లో ఈ పోటీలు నిర్వహించారు. ‘స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రాముఖ్యత’, ‘ఓటు హక్కు ప్రాముఖ్యత’ అంశాలపై వ్యాసరచన పోటీలు, ఈవీఎం, వీవీప్యాట్‌, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై క్విజ్‌ పోటీలు నిర్వహించారు. తొలుత విద్యాసంస్థల స్థాయిలో, అనంతరం నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో డీఈవో ప్రేమకుమార్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శ్యాంప్రసాద్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement