కొమ్మాది: తీరప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, స్థానిక పోలీసులు, కస్టమ్స్, ఇంటెలిజెన్స్ తదితర విభాగాల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. దేశ వ్యాప్తంగా భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీ విజిల్ –2026 కార్యక్రమంలో భాగంగా ఆయన రుషికొండ తీర ప్రాంతాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 13 తీర రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తీర ప్రాంతంలోని కీలక రక్షణ స్థావరాలు, ఆయిల్ అండ్ గ్యాస్ మౌలిక సదుపాయాల భద్రతను పరిశీలిస్తున్నామన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించేలా స్థానిక ప్రజలు, మత్స్యకారులకు అవగాహన కల్పిస్తుట్లు పేర్కొన్నారు. పోలీసుల భద్రత, మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డ్స్ అందుబాటులో లేని మారుమూల బీచ్‌లలో సముద్ర స్నానాలకు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అటువంటి ప్రమాదకర ప్రాంతాలు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తీర ప్రాంత భద్రత కేవలం పోలీస్, రక్షణ విభాగాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అడిషనల్ ఎస్పీ కేవీ రమణ, సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు మురళీకష్ణ, మనోజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


