ఆనందపురం: పోలీస్ స్టేషన్ పరిధిలోని శొంఠ్యాం ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల ఎదురుగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం టి.ఆర్. నగర్ కాలనీకి చెందిన చల్లా ఆదినారాయణ (47)గా గుర్తించారు. ఆయనకు భార్య కొండమ్మ, ఆరుగురు పిల్లలు ఉన్నారు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో కర్ణాటక నుంచి విజయనగరం వైపు వెళ్తున్న లారీ శొంఠ్యాం వద్ద అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి, రహదారి మధ్యలో ఉన్న కల్వర్టు భద్రత గోడను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ ఛాసిస్ కల్వర్టు గోడకు చిక్కుకోగా, వాహనం పైభాగం కల్వర్టులో పడిపోయింది.ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ ఆదినారాయణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


