ఖాకీలకు కళ్లెం.. ప్రాధికార సంస్థకు గ్రహణం! | - | Sakshi
Sakshi News home page

ఖాకీలకు కళ్లెం.. ప్రాధికార సంస్థకు గ్రహణం!

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

పోలీసుల వేధింపులపై ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ నిర్వీర్యం

ప్రచారం లేక.. బాధితులకు అందని భరోసా

వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటు.. ప్రస్తుతం పట్టించుకునే వారేరీ?

ద్వారకానగర్‌: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదు తీసుకోకపోవడం.. ప్రశ్నిస్తే కేసుల పేరుతో బెదిరించడం.. విచారణ పేరుతో వేధించడం.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడడం వంటి ఘటనలతో బాధితులు నలిగిపోతుంటారు. ఇలాంటి పోలీసుల అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి, బాధితులకు న్యాయం కల్పించేందుకు ఏర్పాటైన జిల్లా పోలీస్‌ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ నిర్వీర్యమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం కొరవడింది. మరోవైపు అసలు ఇలాంటి వ్యవస్థ ఒకటుందని, పోలీసులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చనే విషయం కూడా చాలామందికి తెలియకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఏర్పాటైన లక్ష్యం ఏమైంది?

పోలీసుల వేధింపులకు గురైన వారు న్యాయం పొందేందుకు జిల్లా పోలీస్‌ ఫిర్యాదుల ప్రాధికార సంస్థను జిల్లా కలెక్టరేట్‌లోని డీఎస్‌వో కార్యాలయం పక్కన ఏర్పాటు చేశారు. పోలీసుల అధికార దుర్వినియోగం, దురుసు ప్రవర్తన, అక్రమ వసూళ్లు, బెదిరింపులు, అక్రమ నిర్బంధం, దాడులు, ఆస్తుల అక్రమ స్వాధీనం వంటి ఆరోపణలపై ఈ సంస్థను ఆశ్రయించే వెసులుబాటు కల్పించారు. జిల్లాస్థాయిలో డీఎస్పీ, అలాగే వారి కింద పనిచేసే సీఐ, ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే ఇంతటి ప్రాధాన్యమున్న వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ఫలితంగా అప్పుడప్పుడు ఒకటి రెండు ఫిర్యాదులు రావడం మినహా పెద్దగా స్పందన కనిపించడం లేదు.

బాధితులకు భరోసా ఏదీ?

పోలీసులపై ఫిర్యాదు చేస్తే తమకే ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో చాలామంది బాధితులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు పోలీస్‌ స్టేషన్‌లో న్యాయం జరగక, ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోతే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి వారికి ప్రాధికార సంస్థ ఒక ప్రత్యామ్నాయ వేదికగా నిలవాల్సి ఉంది. ఫిర్యాదులు స్వీకరించి, వాటిపై విచారణ జరిపి, సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు పంపే బాధ్యత ఈ సంస్థకు ఉంది. ఆరోపణలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయినా ఈ వ్యవస్థ పనితీరు, ఫిర్యాదు చేసే విధానం, అందుబాటులో ఉన్న సదుపాయాలపై విస్తృత ప్రచారం లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు.

ఫిర్యాదు ఎలా చేయాలంటే..

పోలీసుల వేధింపులకు గురైన బాధితులు పూర్తి వివరాలు, ఆధారాలతో ప్రాధికార సంస్థకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. సంఘటన జరిగిన తేదీ, సమయం, ప్రదేశం, సంబంధిత పోలీసు అధికారి పేరు, హోదా వంటి వివరాలను పొందుపరచాలి. ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలు ఉంటే జతచేయాలి. ఫిర్యాదుదారుడి పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు తప్పనిసరిగా పేర్కొనాలి. వ్యక్తిగత కక్షలతో తప్పుడు ఆరోపణలు చేయకుండా, వాస్తవ ఘటనలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలి. నిజమైన ఫిర్యాదులపై నిబంధనల ప్రకారం విచారణ చేపట్టేందుకు ఈ వ్యవస్థ అవకాశం కల్పిస్తుంది.

ప్రచారం చేస్తేనే ప్రయోజనం

విశ్రాంత జిల్లా న్యాయమూర్తి లేదా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అధ్యక్షతన పలువురు సభ్యులతో ఈ ప్రాధికార సంస్థ కొనసాగుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం అందుబాటులో ఉంటుంది. అయితే సంస్థ చిరునామా, సంప్రదించాల్సిన నంబర్లు, ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడే పోలీసుల వేధింపులకు గురైన సామాన్యులకు ఈ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని, లేనిపక్షంలో బాధితులకు అండగా నిలవాల్సిన ప్రాధికార సంస్థ కార్యాలయానికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement