మహారాణిపేట: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన మెడికల్ పీజీ డిగ్రీ సెప్టెంబర్–2026 పరీక్షల్లో ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నం అనుబంధ ప్రభుత్వ మానసిక ఆరోగ్య వైద్యశాలకు చెందిన విద్యార్థిని డాక్టర్ సెట్టివారి అనూష యూనివర్సిటీ టాపర్గా నిలిచి ప్రతిష్టాత్మక ఘనత సాధించారు. ఎం.డి. (సైకియాట్రీ) విభాగంలో ఆమె 800 మార్కులకు గాను 589 మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందారు. ఈ ఘనతతో ఆంధ్రా మెడికల్ కళాశాల, ప్రభుత్వ మానసిక ఆరోగ్య వైద్యశాల ప్రతిష్ట మరింత ఇనుమడించింది. ఈ సందర్భంగా ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సంధ్యాదేవి, కింగ్ జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ప్రభుత్వ మానసిక ఆరోగ్య వైద్యశాల సూపరింటెండెంట్, సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ కేవీ రామిరెడ్డి, అధ్యాపకులు, వైద్యులు అనూషను అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు డాక్టర్ జి. భాగ్యరావు పేరిట ప్రదానం చేసే ప్రతిష్టాత్మక బంగారు పతకానికి కూడా అనూష ఎంపికయ్యారు.


