మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 57వ వార్షిక సంగీత ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబుకు ప్రతిష్టాత్మక ‘సంగీత కళాసాగర’ బిరుదును ప్రదానం చేశారు. అకాడమీ అధ్యక్షులు కేవీ రామమూర్తి, కార్యదర్శి వి. చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బీఏ రాజారావు, కార్యవర్గ కమిటీ సభ్యులు, కళాభిమానుల సమక్షంలో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం అకాడమీ విశిష్ట పురస్కారాన్ని యువ కళాకారుడు సాకేత్ పంతులకు అందజేశారు. జూన్ నెలలో నిర్వహించిన యువ సంగీతోత్సవంలో ఉత్తమ కచేరీలు అందించిన కళాకారులకు మల్లాది సూరిబాబు చేతుల మీదుగా జ్ఞాపికలు అందించారు. సంగీతంలో ప్రతిభ కనబరుస్తున్న నలుగురు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. అనంతరం మల్లాది సూరిబాబు ‘జయజయ రమానాథ’ నాట రాగ తరంగంతో కచేరీని ప్రారంభించారు. ‘తులశమ్మా మా ఇంట’ వంటి రచనలను రాగాలాపన, స్వరకల్పనలతో భావపూర్వకంగా ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ కచేరీకి ప్రముఖ గాత్ర విద్వాంసులు మల్లాది రవికుమార్ గాత్ర సహకారం అందించగా, సింధు రాగేశ్వరి వయోలిన్, మల్లాది శివానంద శాస్త్రి మృదంగం, ఎస్. హనుమంతరావు ఘటం వాద్య సహకారం అందించారు. సీహెచ్. పల్లవి తంబూరా శృతి సహకారం అందించారు. కార్యక్రమంలో విశాఖ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు కేవీ రామమూర్తి, కార్యదర్శి వి. చంద్రశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


