ముందస్తు సమాచారం లీక్?
జాగ్రత్తపడుతున్న అవినీతిపరులు
త్రుటిలో తప్పించుకున్న ఓ రైటర్, సీఐ
‘వల’ నుంచి తప్పించుకున్న పేరుమోసిన స్టేషన్ అధికారులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
నగరంలో ఎక్కడి కేసునైనా తమ స్టేషన్‌లోనే నమోదు చేసే అలవాటు ఉన్న సదరు స్టేషన్‌కు చెందిన పోలీసుల వసూళ్లపై సమాచారంతో వలవేయగా.. సదరు అవినీతి చేపలు కాస్తా జాగ్రత్త పడి ముందుగానే వలలో పడకుండా తప్పించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగర నడిబొడ్డున ఉన్న ఒక స్టేషన్‌లో పనిచేసే రైటర్‌పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బాధితుడి ద్వారా పక్కా సమాచారంతో వలపట్టి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. చివరి క్షణంలో తప్పించుకున్నాడు.
అదే కోవలో సిటీ శివారులోని ఒక స్టేషన్‌కు చెందిన సీఐ కూడా త్రుటిలో తప్పించుకున్నట్టు విమర్శలున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఎంతో శ్రమించి సేకరించిన సమాచారంతో పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాస్తా బెడిసికొడుతున్నట్టు తెలుస్తోంది. చివరి క్షణంలో సమాచారం ముందుగానే లీక్ కావడమో.. అనుమానం వచ్చి సదరు అవినీతి చేపలు కాస్తా వలకు చిక్కకుండా తప్పించుకోవడమో జరుగుతోంది. అయితే, జరుగుతున్న వ్యవహారంపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇదే తరహాలో ఏసీబీలోని ఇంటి దొంగలు ముందుగానే సమాచారం లీక్ చేస్తుండటంతో అవినీతి అధికారులు హాయిగా తమ వ్యవహారాలను కానిచ్చారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, సదరు సమాచారం లీక్ వీరులకు ఆయా శాఖలకు చెందిన అధికారుల నుంచి నెలనెలా మామూళ్లు భారీగా అందాయనే విమర్శలూ ఉన్నాయి. అయితే దీనిపై ‘సాక్షి’ గతంలో వరుసగా కథనాలు ప్రచురించడంతో ఏకంగా 8 మందిని బదిలీ పేరుతో వేటు వేశారు. ఈ ప్రక్షాళన అనంతరం ఏసీబీ మరింత దూకుడు పెంచింది. అయితే, గత కొద్దిరోజులుగా తిరిగి ఏసీబీ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కడికక్కడ గండిపడుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే సమాచారం లీక్ కావడంతోనే సదరు అవినీతి చేపలు తప్పించుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అదో అవినీతి ‘వల’
ఎప్పటికప్పుడు జనాల సొమ్మును కాజేస్తున్న వ్యవహారాలపై చైతన్యం కలిగిస్తున్న సదరు స్టేషన్‌లో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏళ్లుగా అక్కడే తిష్టవేసుకుని కదలకుండా కూర్చున్న వ్యవహారంపై డిపార్ట్‌మెంట్‌లోనే కథలు కథలుగా అవినీతి వ్యవహారాలను మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది.వాస్తవానికి ఏ కేసునైనా డీల్ చేస్తున్న.. తమ పరిధిలో లేకపోయినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేస్తూ అబాసుపాలవుతున్న సదరు విభాగానికి చెందిన కొందరు పోలీసులు భారీగా వసూళ్లకు తెగబడుతున్నట్టు ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా, ఏళ్లుగా అక్కడే తిష్టవేసిన సదరు ఉద్యోగులు కూడబెట్టుకున్న లెక్కలను పక్కాగా సేకరించిన ఏసీబీ అధికారులు.. పక్కా సమాచారంతో వలపన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే లీక్ అయినట్టు తెలుస్తోంది.ఏ హోటల్‌లో ఎంత మేర పెట్టుబడి పెట్టారు? ఎక్కడెక్కడ పొలాలు, స్థలాలు కొనుగోలు చేశారనే వ్యవహారంపై పక్కాగా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అయితే, ఏసీబీ పంజా విసరనున్న నేపథ్యంలో వారంతా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో కొద్దిమంది ఇప్పటికే సెలవు పెట్టి కొద్దిరోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
శివారు ప్రాంతాల్లో అవినీతి సవారీ
నగర శివారు ప్రాంతంలో భారీగా భూమి సెటిల్‌మెంట్స్‌తో పాటు బ్లాక్ ఆయిల్ దందాకు వెన్నుదన్నుగా.. పేకాట శిబిరాల నుంచి మామూళ్లు ఇలా అన్నింటిలోనూ అందెవేసిన చేయిలా వ్యవహరిస్తున్న సీఐపై కూడా ఏసీబీ నిఘా పెట్టింది.అయితే, ఎక్కడెక్కడ ఎంత తీసుకుంటున్నారు? ఎంత మేర భూమిని ఈ మధ్య కాలంలో కొనుగోలు చేశారనే వివరాలను కూడా సేకరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సదరు శివారు ప్రాంత సీఐ సాగిస్తున్న అవినీతి సవారీని కట్టడి చేసేందుకు పక్కా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారనే ప్రచారం ఉంది. అటువంటి సీఐ పక్కాగా వలలో చిక్కాల్సిన సమయంలో చివరి నిమిషంలో తప్పించుకున్నారని సమాచారం.మొత్తంగా తమ పోలీస్ శాఖలోని అవినీతి అధికారులపై సమాచారం సేకరిస్తున్నప్పటికీ తృటితో తప్పించుకుంటున్నారు. ఈ సమాచారం లీక్ వ్యవహారం ఎక్కడి నుంచి సాగుతుందో కనుగొనే పనిలో ఉన్నతాధికారులు ఉన్నట్టు భోగట్టా.


