వైద్యుల గైర్హాజరుతో పేదలకు తప్పని తిప్పలు
వేధిస్తున్న మందుల కొరత
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు క్లినిక్‌లకు పరుగులు
జిల్లాలోని 66 యూపీహెచ్‌సీల్లో 31 కేంద్రాల్లో ఇదే దుస్థితి
పాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆశయానికి ‘కూటమి’ తూట్లు
సాక్షి, విశాఖపట్నం: నిరుపేదలకు చిన్నపాటి జ్వరం వచ్చినా కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేవి. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే ఆర్థిక భారం తప్పేది కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నగరంలో ప్రతి 2 కిలోమీటర్ల పరిధిలో (30 వేల నుంచి 50 వేల జనాభాకు ఒకటి చొప్పున) పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (యూపీహెచ్‌సీ) ఏర్పాటు చేసింది.
విశాఖ పరిధిలో 66 యూపీహెచ్‌సీలను అందుబాటులోకి తెచ్చి, ప్రతి కేంద్రంలో వైద్యాధికారితో పాటు స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌లను నియమించారు. 60కి పైగా రకాల రక్త పరీక్షలు, 170 రకాల మందులను ఉచితంగా అందిస్తూ పేదలకు చేరువ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థపై నిర్లక్ష్యం నెలకొంది. ఇప్పటికే మందుల కొరత, మౌలిక వసతుల సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతుండగా..తాజాగా పలు యూపీహెచ్‌సీల్లో వైద్యుల గైర్హాజరు కారణంగా సేవలు సక్రమంగా అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిధిలోని 66 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 31 కేంద్రాల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిరుపేదలకు నాణ్యమైన ప్రాథమిక వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యూపీహెచ్‌సీల ఉద్దేశ్యం దెబ్బతింటోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం యూపీహెచ్‌సీల్లో వైద్యులు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలి. కానీ కొన్ని కేంద్రాల్లో వైద్యులు వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన రోజుల్లోనూ పూర్తిస్థాయిలో రోగులకు సేవలు అందించకుండా ‘ఫీల్డ్ విజిట్’ పేరుతో కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. అప్పుఘర్ యూపీహెచ్‌సీ లో వైద్యుడు వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని, అది కూడా కొద్దిసేపటికే వెళ్లిపోతారనే ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిసార్లు మధ్యాహ్నం వేళల్లో మాత్రమే వస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే పరిస్థితి సమీపంలోని పెదవాల్తేరు, పిఠాపురం కాలనీతో పాటు మరో 31 యూపీహెచ్‌సీల్లో ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
సిబ్బంది చేతుల్లోనే వైద్యం
మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో ఉన్న యూపీహెచ్‌సీలకు జ్వరాలు, సీజనల్ వ్యాధులు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా వస్తుంటారు. అయితే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కేంద్రాల్లో రక్త పరీక్షలు, ఈసీజీ వంటి ప్రాథమిక నిర్ధారణ సేవలకు ఆటంకం ఏర్పడుతోందని తెలుస్తోంది. దీంతో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులే రోగులకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గర్భిణులకు నిర్వహించాల్సిన ఏఎన్‌సీ పరీక్షలు సకాలంలో జరగడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర పరీక్షలు అవసరమైన గర్భిణులు, చిన్నారులను కేజీహెచ్, ఘోషాస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఓపీ నమోదు తీరిది..
జీవీఎంసీ పరిధితో కలిపి విశాఖ జిల్లాలో మొత్తం 66 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 80 నుంచి 120 మంది వరకు అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందుతుంటారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ 5,500 నుంచి 7,000 వరకు ఓపీ కేసులు నమోదవుతుంటాయి. అయితే ఇటీవల 31 కేంద్రాల్లో వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఓపీ సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. వైద్యులు అందుబాటులో ఉన్న రోజుల్లో 100కుపైగా నమోదయ్యే ఓపీ.. వారు విధులకు రాని రోజుల్లో 30 నుంచి 40కి పరిమితమవుతోంది. ప్రస్తుతం మందుల కోసం వచ్చే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలే ఎక్కువగా నమోదవుతున్నాయని, కొత్తగా వచ్చే రోగులు వైద్యులు లేరని తెలిసి వెనుదిరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యూపీహెచ్‌సీలపై పర్యవేక్షణ పెంచి, విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.


