ఆనందపురం/పద్మనాభం: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ గురువారం ఆనందపురం, పద్మానాభం మండలాల్లో పర్యటించారు. జగన్నాథపురం, గిడిజాల, గోరింట, జి.ఎస్.అగ్రహారం, కణమాం, దబ్బంద గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులు, వీఎంఆర్‌డీఏ స్థలాలను, కృష్ణాపురంలో పరిశ్రమల పార్కు పనులను, రెడ్డిపల్లిలో ప్రభు త్వ భూములను పరిశీలించారు. ఆయా ప్రాంతా ల్లోని ప్రస్తుత పరిస్థితులు, మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేటాయించిన పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి, వీలైనంత త్వరగా గ్రౌండింగ్ జరిగేలా చూడాలని సూచించారు. అదేవిధంగా విలువైన ప్రభుత్వ భూ ములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి ఆక్రమణలకు తావులేకుండా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సింహాచలం, వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ ఆఫీసర్, ఆనందపురం తహసీల్దార్ ఎస్. శ్రీనుబాబు పాల్గొన్నారు.


