నిర్లక్ష్యంపై జీవీఎంసీ కమిషనర్‌ కొరడా | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంపై జీవీఎంసీ కమిషనర్‌ కొరడా

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

● ముగ్గురు జోనల్‌ కమిషనర్లకు, నలుగురు రెవెన్యూ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు ● వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి సస్పెన్షన్‌

డాబాగార్డెన్స్‌ : ప్రజలకు అందించాల్సిన రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం, ఆస్తిపన్ను దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, పన్నుల వసూళ్లు, బకాయిల పర్యవేక్షణలో అలసత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. మధురవాడ, పెందుర్తి జోన్లకు చెందిన నలుగురు రెవెన్యూ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంతో పాటు, పెందుర్తి జోన్‌లోని ఓ వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రెవెన్యూ సేవల పర్యవేక్షణలో లోపాలు గుర్తించిన ముగ్గురు జోనల్‌ కమిషనర్లకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. మధురవాడ జోన్‌లో రెవెన్యూ వసూళ్లు, పన్నుల బకాయిల నియంత్రణ, రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణలో లోపాలు గుర్తించిన కమిషనర్‌, సంబంధిత రెవెన్యూ అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. సిబ్బంది పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించడంలో, పన్నుల వసూళ్లను మెరుగుపరచడంలో తగిన శ్రద్ధ చూపలేదని పేర్కొన్నారు. అదేవిధంగా రోజువారీ, వారాంతపు మార్కెట్లలో ఆశీలు వసూలు చేసే హక్కుల లీజుకు సంబంధించి బిడ్‌ మొత్తాన్ని తగ్గించే అంశంపై డిప్యూటీ కమిషనర్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి, ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సూపరింటెండెంట్‌ (ఇన్‌చార్జి) హాజరుకాకపోవడాన్ని విధుల పట్ల నిర్లక్ష్యంగా పరిగణిస్తూ వారికి కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పెందుర్తి జోన్‌లో ఆస్తిపన్నుకు సంబంధించిన సర్వీస్‌ రిక్వెస్ట్‌లను ఈఆర్‌పీ వ్యవస్థలో నిర్ణయించిన ఎస్‌ఎల్‌ఏ గడువులోగా పరిష్కరించకుండా, రెండు రోజులకు పైగా పెండింగ్‌లో ఉంచినందుకు సంబంధిత టాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పరిస్థితి మారకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే పెందుర్తి జోన్‌ పరిధిలోని సచివాలయం (1086511) వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి జనరల్‌ రివిజన్‌ పిటిషన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించారు. విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు ఆయన్ను తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జీవీఎంసీ పరిధిలో రెవెన్యూ సర్వీస్‌ రిక్వెస్ట్‌లను నిరంతరం పర్యవేక్షించడంలో, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైన ముగ్గురు జోనల్‌ కమిషనర్లకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా రాతపూర్వక వివరణ సమర్పించాలని, లేనిపక్షంలో నిబంధనల ప్రకారం కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు కొనసాగుతాయని కేతన్‌ గార్గ్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement