డాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ (బాబాజీకొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. పౌర్ణమి రోజున సత్యదేవుని దర్శనానికి విశేష ప్రాధాన్యం ఉండటంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నవరం సత్యదేవుని ఆలయం తరహాలో ప్రాచుర్యం పొందిన ఇసుకకొండ సత్యదేవుని ఆలయం ఉత్తరాంధ్రలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దీంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధనలు నిర్వహించగా, భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వేకువజామున 2 గంటలకు ధ్వజస్తంభ పూజ, విశేష దర్పణ సేవలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం క్యూలైన్లు, షామియానాలు, మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాద పంపిణీ, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 2 గంటలకు, 4 గంటలకు ధ్వజస్తంభ పూజలు నిర్వహించారు. ఉదయం 4, 6, 9 గంటలకు సామూహిక వ్రతాలు జరిపారు. రూ.1,116 చెల్లించిన భక్తులకు అనివెట్టి మండపంలో ఉదయం 7 గంటలకు, 10.30 గంటలకు ప్రత్యేక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులకు ఉదయం 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు.
ప్రదక్షిణలకు అనుమతి లేదు : భక్తుల అధిక రద్దీ కారణంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదని ఆలయ ఈవో రాజగోపాల్‌రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోరుకొండ సూర్యప్రసాద్, సభ్యుడు మట్టపల్లి హనుమంతరావు తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.పూర్ణామార్కెట్ సమీపంలోని దయారామ్ స్వీట్ షాప్ పక్క నుంచి ఆలయానికి ఏర్పాటు చేసిన నూతన ఘాట్ రోడ్డును భక్తులు వినియోగించుకున్నారు. వాహనదారులు, భక్తులు ఈ మార్గం ద్వారా సులభంగా ఇసుకకొండపైకి చేరుకున్నారు.


