తగరపువలస: కార్తీక పౌర్ణమి సెలవు రోజున సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ బాలుడి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి గోస్తనీ నదిలో మునిగి మృతి చెందాడు. సంతపేటకు చెందిన అక్కివరపు అభిషేక్ (14) స్థానిక అంబేడ్కర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కార్తీక పౌర్ణమి సెలవు కావడంతో మంగళవారం స్నేహితులతో కలిసి గోస్తనీ నదిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అభిషేక్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్ తండ్రి కొంతకాలం క్రితమే మృతి చెందాడు. తల్లి సత్యవేణి స్థానికంగా ఎంఎఫ్సీలో పనిచేస్తూ కుమారుడు అభిషేక్, కుమార్తె శ్రీవల్లిని చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడి మృతితో ఆమె కన్నీరుమున్నీరవుతోంది.


