పెందుర్తి: పెయింటింగ్ పనులు చేసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన సప్పిడి శివకిషోర్ నేత్రాలను దానం చేసి అతని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. వివరాలివి.. దొగ్గవానిపాలెంలో నివాసం ఉంటున్న సప్పిడి సత్తిబాబు, ఆదిలక్ష్మి కుమారుడు శివకిషోర్ పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఓ భవనానికి రంగులు వేస్తూ ప్రమాదశాత్తు జారిపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సాయిహెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానం కోసం ప్రస్తావించారు. మృతుని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. దీంతో మృతుడు శివకిషోర్ నేత్రాలను మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధి లక్ష్మి సురక్షితంగా సేకరించారు. పుట్టెడు దుఃఖంలో కూడా మానవత్వం చాటుకున్న కిషోర్ కుటుంబ సభ్యుల తీరును అందరూ అభినందించారు.


