ఆ స్టేషన్ పరిధిలో నెలవారీ మామూళ్లు రూ.లక్షల్లో..? బంగారం కేసులోనూ వాటాల ఆరోపణలు బ్లాక్ ఆయిల్ మాఫియాకు అండ! కబేళాలు, క్రాకర్స్, పేకాట క్లబ్బుల నుంచి ముడుపులు పోలీస్ కమిషనర్ హెచ్చరికలూ బేఖాతరు!
ద్వారకానగర్: కంచే చేను మేస్తే.. కాపాడేదెవరు? ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీనే అక్రమార్కులకు అండగా మారితే.. బాధితులకు న్యాయం చేసేదెవరు? విశాఖ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న నేరగాళ్లను పట్టుకోవాల్సిన ఓ కీలక పోలీస్ అధికారి.. నెలవారీ మామూళ్ల కోసం అక్రమ వ్యాపారులతో చేతులు కలుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన బాధితుల కేసుల్లోనూ వాటాల బాగోతం.. దొంగ బంగారం మాఫియాతో ములాఖత్.. బ్లాక్ ఆయిల్ దందాకు రక్షణ.. కబేళాలు, క్రాకర్స్, పేకాట క్లబ్బుల నుంచి లక్షల్లో వసూళ్లు.. ఇలా ఒకటేమిటి.. ఎక్కడ అక్రమ వ్యాపారం సాగినా అక్కడ ఖాకీ వాటా ఉండాల్సిందేనన్నట్లుగా వ్యవహారం నడుస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
బంగారం రికవరీలోనూ వాటాలా?
ఇటీవల బంగారం పోయిందంటూ ఓ బాధితుడు ఈ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో భాగంగా మూడు తులాల బంగారం విషయంలో వాటాలు పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడికి న్యాయం చేయాల్సింది పోయి, అతడి సొత్తులోనే వాటాలు తీసుకున్నారన్న ఆరోపణలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఈ స్టేషన్ పరిధిలో దొంగ బంగారం కొనుగోలు చేసే ముఠాలతో కొందరు పోలీసులకు సంబంధాలున్నాయని, రికవరీ అయిన సొత్తు తిరిగి మాఫియా చేతుల్లోకి చేరుతోందని ఆరోపణలు ఉన్నాయి.
బ్లాక్ ఆయిల్ దందాకు అండ!
అక్రమ బ్లాక్ ఆయిల్ వ్యాపారంపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే మాఫియాకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు మరోవైపు ఉన్నాయి. సదరు అధికారి నెలకు సుమారు 100 లీటర్ల డీజిల్‌ను పోలీస్ వాహనంతో పాటు తన సొంత వాహనానికి కూడా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
కబేళాలు.. క్రాకర్స్.. పేకాట క్లబ్బులు!
అనధికార కబేళాల నిర్వాహకుల నుంచి భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయించే వ్యాపారులతో లక్షల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్బుల నుంచి సైతం ప్రతినెలా రూ.లక్షలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సమయంలోనూ వసూళ్ల పర్వం సాగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్పెషల్ వింగ్‌కూ హెచ్చరికలా?
స్టేషన్ పరిధిలో అవినీతి ఆరోపణలపై స్పెషల్ వింగ్ నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తే.. సంబంధిత సిబ్బందినే బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే నిఘా విభాగంపై ఒత్తిడి తెస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ కమిషనర్ పలుమార్లు హెచ్చరించినా సదరు అధికారి తీరు మారడం లేదన్నది పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ అండతోనే ధీమానా?
ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అండదండలతోనే సదరు అధికారి ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పలుకుబడితోనే తన వ్యవహారాలకు అడ్డులేకుండా చూసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.


