వచ్చే నెల 27 వరకు ప్రత్యేక బస్సులు
5, 6, 7 రోజుల యాత్రలకు ఏర్పాట్లు
అరకు, లంబసింగికి పిక్నిక్ ప్యాకేజీలు రూ.800 నుంచి..
అందుబాటులోకి సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసీ సర్వీసులు
డాబాగార్డెన్స్: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులతో పాటు కార్తీక మాసంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. శబరిమల యాత్రకు ఐదు, ఆరు, ఏడు రోజుల ప్రత్యేక బస్సులను వచ్చే నెల 27వ తేదీ వరకు నడపనుంది. మరోవైపు అరకు, లంబసింగి తదితర పర్యాటక ప్రాంతాలకు ఒకరోజు పిక్నిక్ ప్యాకేజీలను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే అదనపు బస్సులు కూడా నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు స్పష్టం చేశారు.
ఐదు రోజుల శీఘ్రయాత్ర
విశాఖ నుంచి విజయవాడ, మేల్మరువత్తూర్, ఎరుమేలి మీదుగా పంబ సన్నిధానానికి బస్సు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖకు చేరుకుంటుంది. ఈ సర్వీసులో ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సులో రూ.6,600, ఇంద్ర ఏసీ బస్సులో రూ.8,500 టికెట్ ధరగా నిర్ణయించారు.
ఆరు రోజుల
సత్వర యాత్ర
విశాఖ నుంచి బయలుదేరే ఈ బస్సు విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి మీదుగా పంబ సన్నిధానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం మీదుగా విశాఖకు వస్తుంది. ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సులో రూ.7 వేలు, ఇంద్ర ఏసీ బస్సులో రూ.9 వేలు టికెట్ ధరగా నిర్ణయించారు.
ఏడు రోజుల యాత్ర
ఈ సర్వీసు విశాఖ నుంచి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి మీదుగా పంబ సన్నిధానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖకు చేరుకుంటుంది. ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ బస్సులో రూ.7,600, ఇంద్ర ఏసీ బస్సులో రూ.10 వేలు టికెట్ ధర పెట్టారు.
అరకు, లంబసింగికి పిక్నిక్ ప్యాకేజీలు
కార్తీక మాసం సందర్భంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. అరకు దర్శిని, లంబసింగి టూర్లకు ఒకరోజు ప్రయాణానికి పెద్దలు, పిల్లలకు అల్ట్రా డీలక్స్ బస్సులో ఒక్కొక్కరికి రూ.800 టికెట్ ధర నిర్ణయించారు. ధారమట్టం టూర్‌కు రూ.650తో ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చారు.
ఆన్‌లైన్, కౌంటర్‌లో బుకింగ్
శబరిమల యాత్రతో పాటు పిక్నిక్‌లు, మార్గశిర మాసంలో పంచవైష్ణవి క్షేత్రాల దర్శనాలకు వెళ్లాలనుకునేవారు www.apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు రిజర్వు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ద్వారకా బస్‌స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌లోనూ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 8309265666, 9959225602, 9052227083, 9959225594 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
విజ్ఞాన విహార యాత్రలకూ బస్సులు
కార్తీక మాసంలో విద్యార్థులు, ఇతర గ్రూపుల విజ్ఞాన విహార యాత్రల కోసం అద్దె ప్రాతిపదికన బస్సులు అందించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు తెలిపారు. ప్రయాణికులు బృందాలుగా ముందుకొస్తే వారు కోరిన తేదీల్లో టూర్ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.


