కడుపు నిండా తిండి లేదు..
సంగివలస బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల హాహాకారాలు 62 మంది విద్యార్థులకు ఒక్కటే వాష్‌రూమ్.. ఆరుబయటే కాలకృత్యాలు ఇష్టారాజ్యంగా వంటలు.. అందని అల్పాహారం, భోజనం.. పస్తులతోనే నిద్ర సమస్యలు పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థులు
సంగివలసలోని అద్దె భవనంలో భీమిలి బీసీ బాలుర కళాశాల వసతి గృహం
కన్నవారికి దూరంగా.. ఉన్నత చదువుల ఆశతో హాస్టల్‌లో చేరిన విద్యార్థులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కడుపు నింపే ముద్ద కోసం ఎదురుచూపులు.. కాలకృత్యాలు తీర్చుకునేందుకు గంటల నిరీక్షణ.. రాత్రంతా దోమలతో సహవాసం.. ఇదీ సంగివలస బీసీ బాలుర వసతి గృహంలోని 62 మంది విద్యార్థుల దైన్యం! చదువుల కోసం హాస్టల్‌లో చేరితే కనీసం తిండి, నీరు, నిద్రకు కూడా నోచుకోని దుస్థితి. రెండేళ్లుగా ఇదే నరకం అనుభవిస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. చివరకు ఆకలితో చదువులు సాగించలేమంటూ రోడ్డెక్కి తమ గోడు వెళ్లబోసుకోవాల్సి వచ్చింది.
తగరపువలస: భీమిలి జోన్ రెండో వార్డు సంగివలసలోని ఓ అద్దె భవనంలో బీసీ బాలుర వసతి గృహం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 62 మంది విద్యార్థులు ఉంటూ సమీపంలోని డిగ్రీ, జూనియర్, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. అయితే హాస్టల్‌కు పూర్తిస్థాయి వెల్ఫేర్ అధికారి లేరు. చేపలుప్పాడ వసతి గృహ అధికారి రామచంద్రుడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు వచ్చి వంట సరకులు ఇచ్చి వెళ్తుండటంతో పర్యవేక్షణ కొరవడింది.
పర్యవేక్షణ కరవు..
వంట మనుషులు సమయానికి ఆహారం తయారు చేయడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందకపోవడంతో కొన్నిసార్లు ఆకలితోనే కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది. రాత్రి భోజనం సిద్ధం చేసిన తర్వాత వంట మనిషి వెళ్లిపోవడంతో విద్యార్థులే వడ్డించుకుంటున్నారు. మరోవైపు గదుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో విద్యార్థులే సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుంటున్నారు. దోమల బెడదతో రాత్రిళ్లు నిద్రపోలేకపోతున్నారు.
మెనూ.. బోర్డుకే పరిమితం
ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదు. అల్పాహారంలో చట్నీలు పెట్టడం లేదని, ఒక్కోసారి ఆహారం సరిగా ఉడకక అజీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. పాలు, సాయంత్రం అల్పాహారం, రాత్రి స్నాక్స్ కూడా అందడం లేదని చెబుతున్నారు. మెనూ బోర్డులో మార్పులు చేసినా వాటి ప్రకారం కూడా ఆహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి వంట చేయకపోవడంతో ఒక్కోసారి భోజనం కూడా అందని పరిస్థితి నెలకొంటోందని, విద్యార్థులకు అందాల్సిన మెనూ గోడపై ఫ్లెక్సీకే పరిమితమైందని మండిపడుతున్నారు.
62 మందికి ఒకే వాష్‌రూమ్!
వసతి గృహంలో నాలుగు వాష్‌రూమ్‌లు ఉండగా.. ఒకటి శిథిలావస్థకు చేరింది. మరో రెండు స్నానాలకే వినియోగిస్తున్నారు. మిగిలిన ఒక్కటి మాత్రమే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అందుబాటులో ఉంది. దీంతో 62 మంది విద్యార్థులు ఒకే వాష్‌రూమ్‌పై ఆధారపడాల్సి వస్తోంది. గంటల తరబడి వేచి ఉండలేక బకెట్లతో నీళ్లు పట్టుకుని గోస్తని నది పరిసర ప్రాంతాలు, గెడ్డలు, వ్యవసాయ భూముల వైపు వెళ్తున్నారు.


