పెట్రోలియం వర్సిటీలో విద్యార్థినుల
గదుల్లో అధికారుల మకాం
ప్రత్యామ్నాయ వసతి ఉన్నా..
అమ్మాయిల హాస్టల్ వదలని వైనం
గొంతెత్తితే సస్పెన్షన్ వేటు.. హాస్టల్
నుంచి గెంటేస్తామని బెదిరింపులు
సుమోటోగా స్పందించాలంటూ
మహిళా కమిషన్లకు విద్యార్థినుల విజ్ఞప్తి
సాక్షి, విశాఖపట్నం: జాతీయ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)లో ‘బాలికల హాస్టల్’ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. విద్యార్థినులకు కేటాయించిన వసతి గృహంలో అధికారులు దర్జాగా తిష్టవేయగా, గదుల కోసం ఏడాదిగా అభ్యర్థిస్తున్న అమ్మాయిలకు మాత్రం ’ఖాళీలు లేవు’ అంటూ యాజమాన్యం మొండిచేయి చూపుతోంది. కనీస భద్రత కరవై, సమస్యలపై గొంతెత్తితే అకడమిక్ సస్పెన్షన్ వేటు వేస్తామంటూ బెదిరింపులు వస్తుండటంతో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారు.
పేరుకే లేడీస్ హాస్టల్
ఐఐపీఈలో పరిశోధక, మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతుండటంతో గతంలో గెస్ట్‌హౌస్‌గా ఉన్న భవనాన్ని బాలికల వసతి గృహంగా మార్చారు. అయితే ఇది పేరుకే బాలికల హాస్టల్‌గా మిగిలిపోయింది. ఇందులోని గదులను గెస్ట్‌హౌస్ అవసరాల పేరిట అధికారులు, విద్యార్థేతర వ్యక్తుల నివాసానికి కేటాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రాంగణంలో అధికారులు, బయటి వ్యక్తులు ఉంటుండటంతో తమ గోప్యతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతోందని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు.
ఏడాదైనా దక్కని గది.. కక్షసాధింపు చర్యలు
అధికారులు విడిది చేస్తున్న ఇదే హాస్టల్‌లో గదులు కేటాయించాలంటూ కొందరు విద్యార్థినులు ఏడాది కాలంగా మెయిల్స్ ద్వారా యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. అయినా గదులు ఖాళీ లేవంటూ తిరస్కరిస్తున్నారు. నిజంగానే గదుల కొరత ఉంటే విద్యార్థేతర వ్యక్తులకు ఎలా అవకాశం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో హాస్టల్‌లో భద్రతా లోపాలను ఎత్తిచూపినందుకే, కక్షసాధింపు చర్యగా ఆ విద్యార్థినులకు గదులు కేటాయించకుండా వేధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళా కమిషన్లే దిక్కు..!
వివిధ కార్యక్రమాలకు వచ్చే అతిథుల కోసం స్టాఫ్ క్వార్టర్స్‌లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా, డైరెక్టర్ సైతం అధికారిక బంగ్లాలోకి మారినా.. బాలికల హాస్టల్‌లోని అధికారులు మాత్రం అక్కడి నుంచి కదలడానికి ససేమిరా అంటున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్లు తక్షణమే సుమోటోగా స్పందించి విచారణ జరపాలని విద్యార్థినులు కోరుతున్నారు. తమ భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ఫిర్యాదు చేసిన వారిపై యాజమాన్యం ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిద్రపోతున్న ఫిర్యాదుల సెల్
వసతి, భద్రత సమస్యలపై బాధిత విద్యార్థినులు ఇన్‌స్టిట్యూట్ కంప్లైంట్ సెల్, ఉమెన్స్ కంప్లైంట్ సెల్‌లను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల హాస్టల్ ప్రాంగణంలో కొందరి అనుచిత ప్రవర్తన, బెదిరింపులు, వేధింపులపై ఫిర్యాదులు వచ్చినా యాజమాన్యం కనీసం స్పందించలేదు. పైగా, గొంతెత్తితే హాస్టల్ నుంచి గెంటేస్తామని, అకడమిక్ సస్పెన్షన్ విధిస్తామని బెదిరిస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థినులు నరకం అనుభవిస్తున్నారు.


