వసతి గృహంలో ఎదురవుతున్న సమస్యలను పలుమార్లు ఇన్చార్జి వెల్ఫేర్ అధికారి రామచంద్రుడితో పాటు కళాశాలల యాజమాన్యాల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అయినా పరిష్కారం లభించకపోవడంతో మంగళవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. ఆకలితో చదువులు సాగించడం తమ వల్ల కాదంటూ రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి కృష్ణారావు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వాష్రూమ్ల కొరత, భోజనం, అల్పాహారం, స్నాక్స్ అందకపోవడం తదితర సమస్యలను విద్యార్థులు ఆయన ముందు ఏకరువు పెట్టారు. సమస్యల పరిష్కారానికి కొంత గడువు ఇవ్వాలని, అప్పటిలోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.


