కాసుల కోసం.. కడుపుకోత! | - | Sakshi
Sakshi News home page

కాసుల కోసం.. కడుపుకోత!

Nov 19 2026 12:49 AM | Updated on Nov 19 2026 12:49 AM

సహజ ప్రసవాలకు ‘కత్తెర’..

సిజేరియన్లకు పెద్దపీట!

ఫలితాలివ్వని స్టాఫ్‌ నర్సుల

ప్రత్యేక మిడ్‌వైఫరీ శిక్షణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 శాతం,

ప్రైవేట్‌లో 60 శాతం సిజేరియన్లే..!

జిల్లాలో మొత్తం

ఆస్పత్రులు 271

ప్రసూతి, మాతా శిశు

ఆస్పత్రులు 102

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవ గణాంకాలు

ప్రసవాల రకం గతేడాది ప్రస్తుత ఏడాది

ప్రభుత్వ ప్రైవేట్‌ ప్రభుత్వ ప్రైవేట్‌

సిజేరియన్లు 4,518 6,820 4,621 6,750

సాధారణ 6,309 4,263 6,501 4,543

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), యునిసెఫ్‌ సహకారంతో వైద్యశాఖ అత్యవసర సందర్భాల్లో మాతా శిశువుల మరణాలు తగ్గించేందుకు సీ–సేఫ్‌(సేఫ్‌ సర్జికల్‌) విధానాన్ని తీసుకొచ్చింది. కానీ ఇది క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే తేడా లేకుండా కత్తెర కాన్పులకు ఊతం ఇస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల మేరకు సిజేరియన్లు 10–15 శాతం లోపే ఉండాలి. కానీ జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగటున 40 శాతం శస్త్రచికిత్సలు నమోదవుతుండగా.. ప్రైవేట్‌/కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇది 60 శాతానికి పైనే ఉంది.

అందినకాడికి దోచుకుంటున్నారు

అవసరం లేకపోయినా డబ్బుల కోసం సిజేరియన్లు చేస్తుండటంతో మహిళలు దీర్ఘకాలిక నడుము నొప్పి, ఇన్‌ఫెక్షన్లు, తదుపరి ప్రసవాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిజేరియన్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైనే వసూలు చేస్తూ, ‘జిప్‌’పద్ధతి(కోత కనబడని శస్త్రచికిత్స) పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సి–సెక్షన్ల ఆడిట్‌ను కఠినతరం చేయడంతో పాటు, మిడ్‌వైఫరీ నర్సుల సేవలను సమర్థవంతంగా వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనలు, ఆడిట్‌ గాలికి..

తల్లీబిడ్డల ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైన సహజ(సాధారణ) ప్రసవాలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో నీరుగారుతోంది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లోనూ సిజేరియన్‌ ప్రసవాలు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమ్మ కడుపుకోతకు చెక్‌ పెట్టేందుకు వైద్యశాఖ ‘సీ సేఫ్‌’పేరిట సహజ ప్రసవాలకు రూపకల్పన చేసినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నిబంధనలు, ఆడిట్‌ను గాలికే వదిలేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లపై నిఘా పెట్టేలా ఆదేశాలు జారీ అయినా, అవి ఎక్కడా అమలకు నోచుకోవడం లేదు.

ఫలితమివ్వని ‘మిడ్‌ వైఫరీ’ శిక్షణ

సాధారణ ప్రసవాలను పెంచే ఉద్దేశంతో స్టాఫ్‌ నర్సులకు 18 నెలల పాటు ప్రత్యేక ‘మిడ్‌వైఫరీ’(ప్రసూతి)శిక్షణ అందించారు. గర్భిణులకు భరోసా కల్పిస్తూ, నొప్పులను తట్టుకునేలా మానసిక స్థైర్యం ఇచ్చి, సహజ ప్రసవాలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రూ.కోట్లు వెచ్చించి నర్సులకు శిక్షణ ఇచ్చినప్పటికీ, ఆస్పత్రుల్లో వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవట్లేదు.

ప్రాణ నష్టం లేకుండా ప్రసవాలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రైవేట్‌ ఆస్పత్రులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాం. ఎమర్జెన్సీ కేసుల విషయంలో సిజేరియన్లు తప్పవు. తల్లీబిడ్డల ప్రాణాలను నిలపడానికే సిజేరియన్లు చేయాల్సి వస్తోంది. అవి కూడా చాలా వరకూ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రసవం కోసం వచ్చే గర్భిణికి మల్టిబుల్‌ కాంప్లికేషన్స్‌ ఉన్నప్పుడు సుఖ ప్రసవం కష్టంగా ఉంటుంది. అయినా వైద్యులు కష్ట పడి సాధారణ ప్రసవం చేస్తున్నారు.

– డాక్టర్‌ జగదీష్‌, డీఎంహెచ్‌వో, విశాఖ జిల్లా

మహిళలకు మాతృత్వం వరం. బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అది సహజపద్ధతిలో జరిగితే తల్లీబిడ్డలు అత్యంత సురక్షితంగా ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహానికి అమ్మ కడుపు కోతకు గురవుతోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ, దోపిడీయే పరమావధిగా సిజేరియన్లు చేసేస్తున్నారు. అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేస్తే తప్పులేదు.. కానీ దీనిని సాకుగా చూపి, డబ్బులే ధ్యేయంగా ప్రైవేటు వైద్యులు శస్త్రచికిత్సలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement