సాక్షి, విశాఖపట్నం: ఆక్వాన్ తుపాను ముప్పు నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమీక్షించారు. సంస్థ పరిధిలోని 12 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, త్వరితగతిన నష్ట అంచనా, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ట్రాన్స్‌కో సహకారంతో సుమారు 100 డ్రోన్లను వినియోగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం 12 జిల్లాల్లో 703 ప్రత్యేక బృందాలతో పాటు 8,161 మంది సిబ్బందితో పాటు అవసరమైన వాహనా లు, క్రేన్లు, జేసీబీలను అందుబాటులో ఉంచామన్నారు. ఆస్పత్రులు, తాగునీటి పథకాలు, అత్యవసర సేవల కేంద్రాలు, టెలికాం టవర్లకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. అత్యవసర ఫిర్యాదుల కోసం వినియోగదారులు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.


