అత్యవసర వాహనాలకు
తప్పని ట్రాఫిక్ కష్టాలు
వీవీఐపీల కాన్వాయ్‌లకు ప్రాధాన్యం
ప్రాణాపాయంలో ఉన్న రోగుల
విషయంలోనూ నిర్లక్ష్యమేనా?
ట్రా‘ఫికర్’తో అస్తవ్యస్తంగా మారుతున్న
ప్రధాన జంక్షన్లు
ద్వారకానగర్: విశాఖ నగర రహదారులపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లే అంబులెన్స్‌లకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కాన్వాయ్‌లు వెళ్లేందుకు నిమిషాల్లో గ్రీన్ ఛానళ్లు ఏర్పాటు చేస్తున్న పోలీసు యంత్రాంగం.. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రులకు తరలించే 108 అంబులెన్స్‌లకు మాత్రం ప్రత్యేక దారి కల్పించలేకపోతోంది. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సమయంలో భోగాపురం విమానాశ్రయం నుంచి నగరానికి వీవీఐపీల రాకపోకలు పెరగడం, వారి కాన్వాయ్‌ల కోసం ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ప్రత్యేక కార్యక్రమాలు, వీవీఐపీ పర్యటనల సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినా.. అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నరకప్రాయంగా ప్రయాణం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖ నగరానికి వీవీఐపీల పర్యటనల సమయంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక గ్రీన్ చానళ్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆనందపురం నుంచి నగరంలోకి వచ్చే సుమారు 20 కిలోమీటర్ల ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. వీవీఐపీల కాన్వాయ్‌ల రాకపోకల కోసం ప్రధాన కూడళ్ల వద్ద సాధారణ వాహనాలను నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ముఖ్యంగా కొమ్మాది, కారుషెడ్, స్టేడియం, ఎండాడ, హనుమంతవాక కూడళ్ల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. నిమిషాల్లో దాటాల్సిన దూరానికి గంటల సమయం పడుతుండటంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీవీఐపీల పర్యటనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అవసరమే అయినా.. సామాన్య వాహనదారులతో పాటు అత్యవసర వాహనాలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కేజీహెచ్ వద్ద అంబులెన్స్‌లకు తప్పని తిప్పలు
కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో అంబులెన్స్‌ల పార్కింగ్, ఆటోలు, బస్సుల రద్దీ కారణంగా అత్యవసర వాహనాలు ఆస్పత్రిలోకి వెళ్లడానికి, బయటకు రావడానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇరుకై న మార్గాలు, రహదారుల ఆక్రమణలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. రైల్వే న్యూకాలనీ, డాబాగార్డెన్స్, పూర్ణామార్కెట్, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో రహదారుల ఆక్రమణలు, వాహనాల రద్దీ కారణంగా అంబులెన్స్‌లు 20 నుంచి 30 నిమిషాలపాటు ట్రాఫిక్‌లో నిలిచిపోయిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అస్తవ్యస్త ట్రాఫిక్‌పై దృష్టి సారించి అంబులెన్స్‌లకు ప్రత్యేక దారి కల్పించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సిగ్నల్ వ్యవస్థ నిర్వహణలో డొల్లతనం!
నగరంలో అంబులెన్స్‌ల రాకను గుర్తించి ఆటోమేటిక్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రత్యేక వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది మాన్యువల్ నియంత్రణపైనే ఆధారపడాల్సి వస్తోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య, ఇరుకై న రహదారులు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు అంబులెన్స్‌ల రాకపోకలకు ఆటంకంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రులు అధికంగా ఉన్న ప్రాంతాలు, రద్దీ కూడళ్ల వద్ద అత్యవసర సమయాల్లో రోగులను సకాలంలో తరలించడం సవాలుగా మారుతోంది.


