డ్రోన్ సహాయంతో వృద్ధురాలి కోసం గాలింపు పర్యవేక్షిస్తున్న సీఐ సతీష్‌కుమార్, వృద్ధురాలితో పోలీసులు
పెందుర్తి: అదృశ్యమైన ఓ మతిస్థిమితం లేని వృద్ధురాలిని పెందుర్తి పోలీసులు డ్రోన్ సహాయంతో మూడు గంటల్లో గుర్తించి కుటుంబానికి అప్పగించారు. వివరాలివి.. చినముషిడివాడ శ్రమశక్తినగర్కు చెందిన సేనాపతి వరహాలమ్మ(75) ఆదివారం ఉదయం బహిర్భూమికి అని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. సమయం గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కోడలు వెంకటలక్ష్మి పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవీ సతీష్‌కుమార్ తన బృందంతో డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటల అనంతరం ఆమెను గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ, పోలీసుల చొరవను స్థానికులు అభినందించారు.


