● తూతూమంత్రంగా సాగిన పెట్టుబడుల సదస్సు
● బిజినెస్ టైకూన్ల కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే అధికం
● రెండో రోజు మధ్యాహ్నానికే ఖాళీ అయిన ప్లీనరీ హాళ్లు
● చివరకు అందరికీ ఆహ్వానమంటూ కలెక్టర్ బహిరంగ పిలుపు
● రెండు రోజుల్లో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రకటన
ఖాళీగా
కనిపిస్తున్న మెయిన్ హాల్
సాక్షి, విశాఖపట్నం: దేశవిదేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో కళకళలాడుతుందనుకున్న రెండు రోజుల భాగస్వామ్య సదస్సు వెలవెలబోయింది. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పెయిడ్ ప్రచారకర్తల హడావుడికే వేదికగా మారింది. బిజినెస్ టైకూన్లు, సీఈవోల సందడి కనిపించాల్సిన ప్రాంగణంలో సెల్ఫీ స్టిక్‌లు, మైకులు పట్టుకున్న యూట్యూబర్లు, ఫుడ్ వ్లాగర్లు రీల్స్ చేస్తూ కనిపించారు. తొలిరోజు ప్రచార ఆర్భాటం కనిపించినా.. రెండో రోజు మధ్యాహ్నానికే ప్లీనరీ హాళ్లు ఖాళీ అయ్యాయి. చివరకు అందరూ సదస్సుకు రావచ్చంటూ జిల్లా కలెక్టరే బహిరంగ పిలుపునివ్వాల్సి వచ్చింది. అయినా స్పందన అంతంతమాత్రంగానే ఉండటంతో విద్యార్థులపైనే ఆధారపడాల్సి వచ్చింది. మరోవైపు ముగింపు సందర్భంగా మాత్రం ఏకంగా రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటిస్తూ అంకెల గారడీతో ముగింపు పలికారు.
ఖాళీ హాళ్లతో అధికారుల్లో హడావుడి
తొలిరోజు నుంచే ఆశించిన స్పందన లేకపోవడంతో రెండో రోజు హాళ్లు నిండేలా చూడాలంటూ అధికారులు హడావుడి పడ్డారు. చంద్రబాబు, లోకేశ్ ఇంటర్వ్యూలతో కార్యక్రమాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. వీఐపీ భద్రతా ఏర్పాట్లతో నిర్వహించాల్సిన సదస్సుకు అందరూ ఆహ్వానితులేనంటూ కలెక్టర్ బహిరంగ ప్రకటన చేశారు. అయినప్పటికీ సందర్శకుల సంఖ్య పెరగలేదు. బీ2బీ సమావేశాల్లోనూ వ్యాపార ప్రతినిధుల సందడి లేకపోవడంతో వేలాది రూపాయలు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారులు నిరాశతో వెనుదిరిగారు.
అంకెల్లో పెట్టుబడుల లెక్కలివీ!
రీజనల్ కాన్ఫరెన్స్‌ల ద్వారా 194 ఎంవోయూలు కుదిరాయని, వీటి ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడులు, 1,47,951 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సులో 109 ఎంవోయూల ద్వారా రూ.9,02,434 కోట్ల పెట్టుబడులు, 2,00,358 ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు కార్యక్రమాలను కలిపి మొత్తం 303 ఎంవోయూల ద్వారా రూ.9,88,957 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 3,48,309 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ముగింపు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ముగింపు సభకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.
ఎటుచూసినా ఇన్ఫ్లుయెన్సర్లే!
సదస్సు ప్రాంగణంలో అడుగుపెడితే చాలు.. ఎటుచూసినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సందడే కనిపించింది. పారిశ్రామికవేత్తలు, సీఈఓలు క్యూ కడతారని భావిస్తే.. ఆన్లైన్లో చీరలు విక్రయించేవారు, వస్త్ర దుకాణాల్లో ఆఫర్ల గురించి రీల్స్ చేసేవారు, హోటళ్లలో ఆహార పదార్థాలను పరిచయం చేసే ఫుడ్ వ్లాగర్లే ఎక్కువగా దర్శనమిచ్చారు. వీళ్లంతా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన బిజినెస్ టైకూన్లు కాదు. చేతిలో సెల్ఫీ స్టిక్‌లు, మైకులు పట్టుకుని హాళ్లన్నీ కలియతిరుగుతూ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు వచ్చిన సోషల్ మీడియా ప్రచారకర్తలు. ఈ హడావుడి చూస్తే.. ఇది రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చే బిజినెస్ సమ్మిట్టా? లేక లైక్‌లు, వ్యూస్ కోసం నిర్వహించిన యూట్యూబర్ల సమ్మిట్టా? అన్న సందేహం కలగకమానదు.
జీఐఎస్–2023తో పోలిస్తే నిరాశే!
2023లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు అంబానీ, అదానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకావడంతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తాజా భాగస్వామ్య సదస్సులో మాత్రం ఆ స్థాయి ప్రముఖులు కనిపించలేదు. వేలాది మంది వాణిజ్య ప్రతినిధులు వస్తారని ప్రచారం చేసినా.. ప్రధాన వేదికతో పాటు ప్లీనరీ, బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) హాళ్లలోనూ ఆశించిన సందడి కనిపించలేదు. నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో గత సదస్సుతో పోలిస్తే ఈసారి కార్యక్రమం నిరాశపరిచింది.


