వణికిస్తున్న మధుమేహం.. అప్రమత్తతే ఆయుధం | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న మధుమేహం.. అప్రమత్తతే ఆయుధం

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న మధుమేహం(డయాబెటిస్‌) నేడు ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారింది. ఒకప్పుడు వయసు పైబడినవారిలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ప్రస్తుతం యువత, పిల్లల్ని సైతం పట్టిపీడిస్తోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్య కారణాలు మధుమేహ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం లేదా దాని ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఈ వ్యాధి తీవ్రతను తెలియజేస్తున్నాయి.

బీచ్‌ రోడ్డు/విశాఖ విద్య: ఏటా నవంబర్‌ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మధుమేహంపై ప్రజల్లో అవగాహన పెంచడం, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం, బాధితులకు సరైన చికిత్స అందేలా ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్య’అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు. మధుమేహం ఒక్కసారి వస్తే జీవితాంతం మందులపై ఆధారపడాల్సిందేననే భయాన్ని పక్కనపెట్టి, సరైన జీవనశైలి, వైద్యుల పర్యవేక్షణతో వ్యాధిని సమర్థంగా నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిర్లక్ష్యం చేస్తే అవయవాలకు ముప్పు

మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం అధికంగా ఉంటే కిడ్నీ వైఫల్యానికి దారితీయవచ్చు. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రెటీనాపై ప్రభావం పడి చూపు మందగించడం, చివరకు చూపు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. నరాలు దెబ్బతినడం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంట, స్పర్శ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పాదాలకు గాయాలైనప్పుడు అవి త్వరగా మానకపోవడం కూడా మధుమేహ బాధితులు ఎదుర్కొనే ప్రధాన సమస్యే.

చిరుధాన్యాలతో ఆరోగ్యానికి భరోసా

మధుమేహ నియంత్రణలో ఆహారపు అలవాట్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని వైద్యులు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాల్లో పీచు పదార్థాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తగిన పరిమాణంలో సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. ఆహార నియంత్రణతో పాటు వ్యాయామం, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

చిరుధాన్యాల పంపిణీతో లిమ్కా బుక్‌ రికార్డు

ఈ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించేందుకు ఏకంగా 1,100 కిలోల చిరుధాన్యాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం, సంప్రదాయ చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం, మధుమేహ ముప్పుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ముందుగానే మేలుకోవాలి

రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, వారానికి 150 నిమిషాల వ్యాయామం, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలతో కూడిన సమతుల ఆహారం, తగిన నిద్ర తప్పనిసరి. క్రమం తప్పకుండా షుగర్‌, హెచ్‌బీఏ1సీ పరీక్షలు చేయించుకోవాలి. ముందుగానే గుర్తించి అప్రమత్తమై సరైన చికిత్స తీసుకుంటే గుండె, మూత్రపిండాలు, కళ్ల సమస్యలు నివారించవచ్చు. ముందుగానే మేలుకొని వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నప్పుడే మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుంది.

– డాక్టర్‌ భారతి కొల్లా,

కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌,

కిమ్స్‌ హాస్పిటల్స్‌, సీతమ్మధార

భారత్‌లో ప్రతి ఐదుగురిలో

ఒకరికి ముప్పు

మారుతున్న జీవనశైలి, ఊబకాయం,

ఒత్తిడే కారణం

నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, కళ్లు,

నరాలపై తీవ్ర ప్రభావం

విశాఖలో 30 మంది వైద్యులతో

నేడు అవగాహన ర్యాలీ

ముందస్తు పరీక్షలతో

ముప్పు తగ్గించుకోవచ్చు

మధుమేహం ప్రారంభ దశలో చాలామందికి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. తరచూ దాహం వేయడం, అధికంగా మూత్ర విసర్జన కావడం, ఆకలి పెరగడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడంతో పాటు అవసరమైన వారు హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు అప్రమత్తంగా ఉండాలి.

30 మంది వైద్యులతో నేడు అవగాహన ర్యాలీ

ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో వినూత్న అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో తొలిసారిగా వివిధ వైద్య విభాగాలకు చెందిన 30 మంది వైద్యులు ఒకే వేదికపైకి వచ్చి మధుమేహం నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘వాక్‌ విత్‌ ఆరా’పేరుతో శనివారం బీచ్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించనున్నారు. మధుమేహం శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపే వ్యాధి కావడంతో వివిధ విభాగాల వైద్యుల సమష్టి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement