పుట్ట పూజకు వెళ్తూ
ప్రమాదానికి గురైన అక్కాచెల్లెళ్లు
చెల్లి మృతి.. అక్కకు తీవ్ర గాయాలు
అనారోగ్యంతో ఇంటి వద్దే ఉన్న తండ్రికి తీరని శోకం
పీఎం పాలెం: నాగులచవితి పండగను కుటుంబంతో కలిసి జరుపుకోవాలనుకున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. పుట్ట వద్ద పూజలు చేసేందుకు ఉదయాన్నే స్వగ్రామానికి బయలుదేరారు. కానీ ఆ ప్రయాణం మధ్యలోనే మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. పెద్ద కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. పండగపూట ఇంటికి చేరాల్సిన బిడ్డ విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా చోడవరం సమీపంలోని గోవాడ గ్రామానికి చెందిన కోరిమిల్లి వేణుగోపాలరావు కుటుంబంతో కలిసి పీఎం పాలెం ఆఖరి బస్టాప్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. స్థానిక విద్యాసంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఎంబీఏ చదువుతున్న ఆదిత్యహర్షిణి (22), అమృతవర్షిణి (21) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగులచవితి సందర్భంగా శుక్రవారం ఉదయం 6 గంటలకు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ స్కూటీపై గోవాడకు బయలుదేరారు. తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇంటివద్దే ఉండిపోయారు. జాతీయ రహదారిపై పీఎం పాలెం లా కాలేజీ జంక్షన్ సమీపానికి చేరుకోగానే స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న అమృతవర్షిణి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వెనుక కూర్చున్న ఆదిత్యహర్షిణికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఆదిత్యహర్షిణిని ఆస్పత్రికి తరలించారు. అమృతవర్షిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. పండగ పూట పుట్ట వద్ద పూజలు చేసి ఆనందంగా ఇంటికి తిరిగొస్తారనుకున్న కుమార్తెల్లో ఒకరు కానరాని లోకాలకు వెళ్లిపోవడం, మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.


