ఎస్‌ఈసీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న అధికార యంత్రాంగం
పీవోలకు రూ.300, ఓపీవోలకు రూ.550 చొప్పున కోత
తొమ్మిది రోజుల పాటు పనిచేసినా మాస్టర్ ట్రైనర్లకు పైసా విదల్చని వైనం
మహారాణిపేట: జీవీఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషకాలపై కోతలు విధించడంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్దేశించిన మొత్తాలకు బదులుగా తక్కువ చెల్లించడమే కాకుండా, తొమ్మిది రోజులపాటు శిక్షణ ఇచ్చిన మాస్టర్ ట్రైనీలకు ఇప్పటికీ పారితోషకం అందించలేదు. మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి భోజనాలు, అల్పాహారం ఏర్పాట్లలోనూ నిర్లక్ష్యం కనిపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి.
రూ.550 వరకు కోత
జీవీఎంసీ పరిధిలో ఈ నెల ఒకటో తేదీన మేయర్ పదవితోపాటు 120 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 14,334 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎస్‌ఈసీ నిర్దేశించిన ప్రకారం ప్రిసైడింగ్ అధికారులకు రూ.1,600 చెల్లించాల్సి ఉండగా కొన్ని చోట్ల రూ.1,300 మాత్రమే ఇచ్చారు. ఓపీఓలకు రూ.1,350కు బదులుగా రూ.800, ఎన్నికల సూపర్‌వైజర్లకు రూ.2,000కు బదులుగా రూ.1,000, అసిస్టెంట్లకు రూ.1,350కు బదులుగా రూ.900 చెల్లించినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తారని ఆశించినా ఇప్పటివరకు అందలేదని వాపోతున్నారు.
మాస్టర్ ట్రైనర్లకు మొండిచేయి
ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు 56 మంది మాస్టర్ ట్రైనర్లను నియమించారు. వీరు తొమ్మిది రోజులపాటు ఆదివారాలు, సెలవు రోజుల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పారితోషకంగా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భోజనాలు, వసతుల్లోనూ నిర్లక్ష్యం
పోలింగ్, ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పలుచోట్ల నాసిరకం భోజనం, అల్పాహారం అందించారని ఆరోపణలు ఉన్నాయి. సమయానికి భోజనాలు, తాగునీరు అందక ఇబ్బందులు పడ్డారు. రాత్రిపూట కేంద్రాల్లో విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగులకు సరైన భద్రత, మరుగుదొడ్ల సదుపాయం లేక అవస్థలు తప్పలేదు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
పారితోషకాల చెల్లింపుల్లో వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఈసీ నిర్ణయించిన మొత్తాల కంటే తక్కువ చెల్లించడంతో ఉపాధ్యాయులు నష్టపోయారు. ఈ వ్యవహారాన్ని జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరిస్తాం. పెండింగ్ మొత్తాలను చెల్లించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.
– టి.ఆర్.అంబేడ్కర్, ప్రధాన కార్యదర్శి,
ఏపీయూటీఎఫ్ విశాఖ జిల్లా
ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగించాలి
ఎస్‌ఈసీ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులకు పారితోషకం పూర్తిస్థాయిలో చెల్లించాలి. అనారోగ్యంతో ఉన్నవారికి, 55 ఏళ్లు పైబడినవారికి ఎన్నికల విధులు కేటాయించడంతో మానసిక ఆందోళనకు గురయ్యారు. మహిళా ఉపాధ్యాయులకు 80–100 కిలోమీటర్ల దూరంలో డ్యూటీలు వేయడంతో పాటు కనీస వసతులు, భోజన సదుపాయాలు కల్పించక ఇబ్బందులు పడ్డారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– అన్ను వెంకటరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఎస్‌సీ, ఎస్‌టీ టీచర్స్ ఫెడరేషన్ (1991)


