పాడేరు రూరల్: రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–14 వాలీబాల్ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు సత్తా చాటింది. బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బాలికల విభాగంలోనూ ద్వితీయ స్థానాన్ని సాధించి తన ప్రతిభను చాటింది. మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ టి. నిశాంతి విజేతలకు షీల్డులు, బహుమతులు అందజేశారు.
విజేత జట్ల వివరాలివీ.. :బాలుర విభాగంలో విశాఖ జిల్లా జట్టు ప్రథమ స్థానం, విజయనగరం ద్వితీయ స్థానం, నెల్లూరు తృతీయ స్థానం, చిత్తూరు నాలుగో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో విజయనగరం జట్టు ప్రథమ స్థానం, విశాఖ ద్వితీయ స్థానం, తూర్పుగోదావరి తృతీయ స్థానం, అనంతపురం నాలుగో స్థానంలో నిలిచాయి.
జాతీయ స్థాయికి 24 మంది ఎంపిక : రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారుల్లో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు.


