కాలుష్య దీపావళి! | - | Sakshi
Sakshi News home page

కాలుష్య దీపావళి!

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

సాక్షి, విశాఖపట్నం: దివ్వెల పండుగ దీపావళి సంబరాలు నగరంలో అంబరాన్నంటాయి. అదే స్థాయిలో కాలుష్యమూ విజృంభించి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. గురువారం రాత్రి నగరవాసులు పోటీపడి బాణసంచా కాల్చడంతో స్వచ్ఛమైన సాగర గాలి ఒక్కసారిగా విషపూరితంగా మారింది. లక్ష్మీదేవి పూజల అనంతరం మొదలైన టపాసుల మోతతో నగర వాతావరణం దట్టమైన పొగ మేఘాలతో నిండిపోయింది. నగర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సాగరతీర నగరాన్ని విషపూరిత పొగ కమ్మేసి ప్రజలను ఊపిరాడకుండా చేసింది.

8 గంటలకే 247కు చేరిన కాలుష్యం

దీపావళి రాత్రి 7.01 గంటలకు వాయు నాణ్యత సూచీ 191 ఏక్యూఐగా నమోదైంది. సమయం గడిచేకొద్దీ టపాసుల మోత పెరగడంతో రాత్రి 7.31 గంటలకు 210కి చేరింది. 8.01 గంటల సమయానికి బాణసంచా పేలుళ్లు మరింత పెరగడంతో వాయు నాణ్యత సూచీ 247కు చేరుకుంది. దీంతో నగరమంతటా పొగ దట్టంగా అలముకుంది.

9.31 గంటలకు కాలుష్య ప్రళయం

రాత్రి 8.30 గంటల నుంచి బాణసంచా కాల్చడం తారస్థాయికి చేరింది. దీంతో వాయు నాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. రాత్రి 8.31 గంటలకు ఏక్యూఐ 423కి, 9.01 గంటలకు 444కి చేరుకుంది. టపాసుల మోత మరింత పెరగడంతో రాత్రి 9.31 గంటలకు విశాఖపట్నం వాయు నాణ్యత సూచీ ఏకంగా 521 ఏక్యూఐకి చేరింది. నగర చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్యం నమోదైంది.

అర్ధరాత్రి దాటినా తగ్గని తీవ్రత

రాత్రి 10 గంటల తర్వాత బాణసంచా కాల్చడంపై ఉన్న ఆంక్షలను సైతం పట్టించుకోకుండా పలుచోట్ల టపాసులు కాల్చడం కొనసాగించారు. దీంతో రాత్రి 11.01 గంటలకు కూడా కాలుష్య సూచీ 409 ఏక్యూఐగా నమోదై ప్రమాదకర స్థాయిలోనే కొనసాగింది. రాత్రి 11.31 గంటల ప్రాంతంలో టపాసుల మోత కొంత తగ్గడంతో సూచీ 367కి పడిపోయింది. అయినప్పటికీ సాధారణ స్థాయితో పోలిస్తే కాలుష్య తీవ్రత ఎన్నో రెట్లు అధికంగానే ఉంది.

కాలనీల్లో భారీగా పెరిగిన విష కణాలు

నగరంలోని ప్రధాన నివాస ప్రాంతాల్లో సూక్ష్మ ధూళి కణాలైన పీఎం10, పీఎం2.5 స్థాయులు విపరీతంగా పెరిగాయి. పోలీస్‌ బ్యారెక్స్‌ ప్రాంతంలో పీఎం10 కణాల స్థాయి సాధారణంగా ఉండే 124 మైక్రోగ్రాముల పర్‌ క్యూబిక్‌ మీటర్‌ నుంచి ఏకంగా 274కు ఎగబాకింది. ఊపిరితిత్తుల్లోకి నేరుగా చేరే పీఎం2.5 కణాల స్థాయి 131 మైక్రోగ్రాముల పర్‌ క్యూబిక్‌ మీటర్‌కు పెరిగింది. ఎంవీపీ రైతుబజార్‌ ప్రాంతంలో పీఎం10 స్థాయి 266కు చేరింది. ఆటోనగర్‌లో 241, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 249గా నమోదైంది. ఈ గణాంకాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టం చేస్తున్నాయి.

20 మందికి గాయాలు

దట్టమైన పొగ, కాలుష్యం కారణంగా వృద్ధులు, ఆస్తమా బాధితులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్వాస తీసుకోవడంలో అవస్థలు పడ్డారు. మరోవైపు టపాసుల ప్రమాదాల్లో నగరంలో 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఐదుగురు చికిత్స పొందగా, కేజీహెచ్‌లో మరో ఐదుగురికి వైద్యం అందించారు. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో మరో 10 మంది గాయాలతో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక పండుగ ముగిసిన మరుసటి రోజు ఉదయానికి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది నగర వీధుల నుంచి సాధారణ రోజుల్లో సేకరించే చెత్తకు అదనంగా 700 టన్నులకు పైగా టపాసుల వ్యర్థాలను తొలగించారు. దీపావళి సంబరాల వెనుక దాగిన కాలుష్య భారం ఎంత తీవ్రంగా ఉందో ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

భారీగా పెరిగిన కాలుష్యం

గోపాలపట్నం: దీపావళి సందర్భంగా విశాఖ నగరంలో శబ్ధ, వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కురుపాం మార్కెట్‌లో అత్యధికంగా 96.5 డెసిబుల్స్‌, జూపార్క్‌ ప్రాంతంలో 95.4, సుజాతానగర్‌లో 89.8, ఎంవీపీ రైతుబజారులో 87.4 డెసిబుల్స్‌ శబ్ధ తీవ్రత నమోదైంది.

వాయు కాలుష్యమూ అధికమే

వాయు కాలుష్యం కూడా గణనీయంగా పెరిగినట్లు పీసీబీ వెల్లడించింది. 11 ప్రాంతాల్లో గాలి నాణ్యతను పరిశీలించగా జీవీఎంసీ కార్యాలయం వద్ద అత్యధికంగా 367 మైక్రోగ్రాములు/క్యూబిక్‌ మీటర్‌, పోలీస్‌ బ్యారక్స్‌ వద్ద 331, జ్ఞానాపురంలో 313 నమోదైనట్లు తెలిపింది.

రాత్రి 9:31 గంటలకు 521 ఏక్యూఐతో నగర చరిత్రలోనే గరిష్ట కాలుష్యం

టపాసుల మోతతో విషపూరిత పొగలో చిక్కుకున్న సాగర నగరం

అర్ధరాత్రి దాటినా తగ్గని కాలుష్య తీవ్రత.. శ్వాసకోశ రోగులకు ఇక్కట్లు

టపాసుల ప్రమాదాల్లో 20 మందికి పైగా గాయాలు

నగర వీధుల్లో 700 టన్నులకు పైగా అదనపు వ్యర్థాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement