సింహాచలం: సింహగిరిపై నరకాసుర వధ ఉత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఒక పల్లకీలో, నరకాసురుడి విగ్రహాన్ని మరో పల్లకీలో కొలువుదీర్చి.. ఇరు పల్లకీలను మాడ వీధుల్లో ఎదురెదురుగా నిలిపి యుద్ధ ఘట్టాలను ప్రదర్శించారు. అనంతరం నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహించి, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అర్చకులు నరకాసుర వధ ఘట్టాలను భక్తులకు వివరించారు. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, అర్చకుడు పవన్‌కుమార్, వేద పండితులు ఉత్సవాన్ని నిర్వహించారు. సింహగిరి గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


