విశాఖ విద్య: హక్కుల సాధన కోసం ఏళ్ల తరబడి సాగించిన పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. దశాబ్దాలుగా ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక భద్రతకు నోచుకోకుండా, చాలీచాలని వేతనాలతో జీవితాలను వెళ్లదీస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయి. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) సదుపాయాన్ని వర్తింపజేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు పాతికేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రత లేని జీవితాలు..
దాదాపు 25 ఏళ్లుగా విశ్వవిద్యాలయంలో బోధన అందిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇన్నాళ్లూ కనీస సామాజిక భద్రత కరువైంది. పదవీ విరమణ అనంతరం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగికీ ఈపీఎఫ్ హక్కుగా దక్కాలన్న లక్ష్యంతో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య నేతృత్వంలో అధ్యాపకులు సంఘటితమయ్యారు. చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగించారు.
రెండేళ్లుగా పోరాటాలు
రెండేళ్లుగా ఆంధ్రా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(కాంట్రాక్ట్) ఆధ్వర్యంలో సభ్యులను సమీకరించి, తమ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్, రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రాంబాబులను కలిసి వినతిపత్రం సమర్పించారు. వివిధ దశల్లో శాంతియుత నిరసనలు చేపట్టి తమ డిమాండ్‌ను బలంగా వినిపించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి ఈపీఎఫ్ అమలుకు మార్గం సుగమమైంది.
కేంద్ర కార్మిక చట్టాల చొరవతోనే..
సామాజిక భద్రత కోడ్–2020 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈపీఎఫ్‌వో చొరవ మా హక్కుల సాధనకు దోహదపడింది. ఈ చట్టపరమైన వెసులుబాటుతో ఏయూ యాజమాన్యం, ఈపీఎఫ్ కార్యాలయం సమన్వయంతో ఒప్పంద అధ్యాపకులందరికీ ఈపీఎఫ్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అక్టోబర్ నుంచి ఒప్పంద ఉద్యోగుల వాటాను వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి ఈ ప్రయోజనాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
– డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య, అధ్యక్షుడు,
ఏయూ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్
ఏయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల
పోరాటానికి విజయం


