భీమునిపట్నం: బైక్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన మైలిపల్లి రామస్వామి(31)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. భీమిలి ఎగువపేట వద్ద తన బంధువు ఇంటికి శనివారం వచ్చి తన బైక్పై తగరపువలస వెళ్తుండగా, జమ్మిచెరువు పార్కు దాటిన తరువాత వాహనం అదుపుతప్పి, కల్వర్ట్ కింద ఉన్న మురుగు కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. అతని వెనుక వస్తున్న మేనమామ రామారావుకు ప్రమాదం గురించి తెలిసి వెంటనే రామస్వామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


