గోపాలపట్నం: దీపావళి పండగ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత టపాసులు కాల్చవద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
సాకేతపురానికి చెందిన సోమాదుల బుజ్జి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయి రూపేష్(19) ప్రభుత్వ ఐటీఐలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. వ్యసనాలకు బానిసయ్యాడు. ఆదివారం దీపావళి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రూపేష్ ఉత్సాహంగా టపాసులు కాల్చాడు. అందరితో కలిసి భోజనం చేసి, అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా బయట బాంబులు కాలుస్తుండటంతో... ‘రాత్రి చాలా టైం అయింది, ఇక పడుకో’మని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మందలించారు. ఆ మందలింపును తట్టుకోలేకపోయాడు. బయటకు వెళ్లి వస్తానని.. చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రూపేష్ ఎంతకీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చివరకు ఇంటి సమీపంలోని దుర్గాదేవి మండపంలో చీరతో ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ రూపేష్ కనిపించాడు. కంటిముందు తిరుగాడే కొడుకు ఆ స్థితిలో కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శంకరనారాయణ పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పండగ రోజు చిన్న విషయానికే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవడంతో సాకేతపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


