చిన్నారుల ఆడిటోరియం.. పెద్దల వేడుకలకు పరిమితం! | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల ఆడిటోరియం.. పెద్దల వేడుకలకు పరిమితం!

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

ఎనిమిదేళ్లయినా నోచుకోని బాలల ఉత్సవాలు రూ.16 కోట్లతో ఆధునికీకరించిన చిల్డ్రన్స్‌ ఎరీనాలో బాలల ప్రదర్శనలేవీ? వినోదం, విజ్ఞానం అందించాల్సిన చోట పెళ్లిళ్లు, రాజకీయ సమావేశాలు!

బీచ్‌ రోడ్డు: పిల్లలకు వినోదం, విజ్ఞానం అందించాలనే లక్ష్యంతో రూ.16 కోట్ల వ్యయంతో సిరిపురంలో వీఎంఆర్డీఏ నిర్మించిన ‘చిల్డ్రన్స్‌ ఎరీనా’దారి తప్పింది. పెళ్లి విందులు, సినిమా ఫంక్షన్లు, మతపరమైన కార్యక్రమాలు, ఇతర వేడుకలకు నిలయమై.. చిన్నారులకు దూరమైంది. ఏ ఉద్దేశంతో ఈ ఆడిటోరియాన్ని నిర్మించారో, ఆ లక్ష్యం నీరుగారిపోయింది. ఈ ఏడాది కూడా బాలల ఉత్సవాలు నిర్వహించలేమని అధికారులు చేతులెత్తేశారు. ఈ చిల్డ్రన్స్‌ ఎరీనా ప్రారంభించి 8 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారికంగా బాలల ఉత్సవాలను నిర్వహించకపోవడం గమనార్హం.

రూ.16 కోట్లతో ఆధునికీకరణ

చిన్నారులు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే సినిమాలు, సమాజంపై బాధ్యతను పెంచే చిత్రాల ప్రదర్శనతో పాటు విజ్ఞానం అందించే సైన్స్‌ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడానికి వీఎంఆర్డీఏ దీన్ని నిర్మించింది. దీనిని ఆధునికీకరించేందుకు 2012లో పనులు ప్రారంభించగా, 2018 నాటికి రూ.16 కోట్లతో పనులు పూర్తి చేసి ఎరీనాను ఘనంగా ప్రారంభించారు. 600 సీట్లతో 4కే టెక్నాలజీతో థియేటర్‌తో పాటు, కింద ఫ్లోర్‌లో ఎగ్జిబిషన్‌ హాల్‌ను నిర్మించారు.

8 ఏళ్లుగా చిత్ర ప్రదర్శనలేవీ?

దేశంలోనే రెండో చిల్డ్రన్స్‌ ఎరీనాగా పేరుగాంచిన ఈ ఆడిటోరియంలో గత 8 ఏళ్లలో కనీసం ఏడు చిత్రాలు కూడా ప్రదర్శించిన దాఖలాలు లేవు. 2018లో చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేసినా... సాంకేతిక కారణాల వల్ల అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత ఒక్క పిల్లల చిత్రోత్సవం కూడా నిర్వహించలేదు. ఈ ఏడాది నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల ఉత్సవాలు నిర్వహించాలని బాలల పరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు వీఎంఆర్డీఏ అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేశారు.

విజ్ఞాన ప్రదర్శనల ఊసే లేదు

సైన్స్‌ ఎగ్జిబిషన్ల ద్వారా చిన్నారులకు విజ్ఞానం అందించాల్సిన చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఆధునికీకరణ తర్వాత ఒక్క సైన్స్‌ ప్రదర్శన కూడా జరిగిన దాఖలాల్లేవు. మొదట్లో ప్రైవేట్‌ సంస్థలు అప్పుడప్పుడు విద్యార్థులకు పోటీలు నిర్వహించడం మినహా, వీఎంఆర్డీఏ తరఫున ఎటువంటి సైన్స్‌ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయలేదు. ఎరీనా ఆధునికీకరణ అనంతరం రెండేళ్ల పాటు వీఎంఆర్‌డీఏ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వాటికీ స్వస్తి పలికింది. గడిచిన ఐదేళ్లలో సమ్మర్‌ క్యాంపుల జోలికే పోలేదు. దీంతో చిన్నారులు ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసే వేసవి శిక్షణ తరగతుల్లో చేరేందుకు రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది.

పెద్దల కార్యక్రమాలకే ప్రాధాన్యం

చిల్డ్రన్స్‌ ఎరీనాలో చిన్నారుల కోసం కాకుండా, వీఎంఆర్డీఏ పెద్దల కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. గడిచిన ఎనిమిదేళ్లలో సినిమా ఫంక్షన్లు, రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలు, విందులు వంటి వాటికే ఎరీనాను కేటాయించారు. వినోదం కాకపోయినా, కనీసం విజ్ఞానం అందించే సైన్స్‌ ఎగ్జిబిషన్లు వంటివైనా పిల్లల కోసం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అధికారుల దృష్టికి

తీసుకువెళ్తాం

వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో చిన్నారుల కోసం చిత్రాల ప్రదర్శన, సైన్స్‌ ఎగ్జిబిషన్ల ఏర్పాటుపై తల్లిదండ్రుల నుంచి అనేక వినతులు వచ్చాయి. గతంలో అనేకసార్లు అధికారులకు నివేదించాం. ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా బాలల ఉత్సవాలు నిర్వహించకపోవడం దారుణం. చిన్నారులకు వినోదం, విజ్ఞానం అందించడం ప్రభుత్వ బాధ్యత. చిన్నారుల కోసం కేటాయించిన ఆడిటోరియంలో పెద్దల కార్యక్రమాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదు.

– గొండు సీతారాం, కన్వీనర్‌,

చైల్డ్‌ రైట్స్‌ అవేర్‌నెస్‌ ఫోరమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement