48 గంటల ముందే వేదికలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

48 గంటల ముందే వేదికలు సిద్ధం చేయాలి

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

● బీచ్‌లు, పర్యాటక ప్రాంతాల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు ● రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువరాజ్‌

మహారాణిపేట: విశాఖ వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2026కు సంబంధించిన అన్ని వేదికలను ప్రారంభానికి 48 గంటల ముందే సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాటికి నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు పూర్తి చేసి పోలీస్‌ శాఖ తనిఖీలకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఫైర్‌ సేఫ్టీ, విద్యుత్‌ సరఫరా, ఆడియో వ్యవస్థలతో పాటు అన్ని ఏర్పాట్లను తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. సమ్మిట్‌ ఏర్పాట్లపై యువరాజ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రతినిధులు, ఉన్నతాధికారులు నగరానికి చేరుకోనున్న నేపథ్యంలో వసతి, రవాణా, భద్రత, ప్రోటోకాల్‌ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ప్రారంభోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. ఇతర దేశాల మంత్రులు, రాయబారులు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని చెప్పారు. అతిథుల కోసం గుర్తించిన హోటళ్లు, వాహనాలు, లైజన్‌, ప్రోటోకాల్‌ అధికారులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 14న అతిథుల సందర్శన కోసం గుర్తించిన పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లను విద్యుత్‌ దీపాలు, పూలు, మొక్కలతో సుందరీకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. అన్ని వేదికల వద్ద సమాచార శాఖ రూపొందించిన బ్యాక్‌డ్రాప్‌లనే వినియోగించాలని స్పష్టం చేశారు.

అంతా సమష్టిగా పనిచేయాలి

సమ్మిట్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. సోమవారం నిర్వహించిన వర్చువల్‌ సమీక్షలో ఆయన మాట్లాడుతూ సుమారు 59 దేశాల నుంచి ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు, 1,250 మందికిపైగా దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, సీఈవోలు హాజరుకానున్నట్లు తెలిపారు. ‘నావిగేటింగ్‌ ది న్యూ వరల్డ్‌ ఆర్డర్‌: ట్రేడ్‌, టెక్నాలజీ, ట్రస్ట్‌’ ఇతివృత్తంతో జరిగే సదస్సులో వాణిజ్యం, గ్రీన్‌ ఎనర్జీ, క్వాంటం కంప్యూటింగ్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్‌, ఏరోస్పేస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ తదితర కీలక రంగాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలను చాటిచెప్పేందుకు ఏపీ పెవిలియన్‌, ఎంఎస్‌ఎంఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం 26 హోటళ్లలో 580 గదులను గుర్తించామని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. ఎవరికి ఏ హోటల్‌ కేటాయించారనే వివరాలను లైజన్‌ అధికారులకు ఇప్పటికే అందజేశామన్నారు. ప్రధాన, ఇతర వేదికల్లో సీటింగ్‌, డీమార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామని, భోజన సదుపాయాలను కూడా వేర్వేరుగా కల్పిస్తున్నామని వివరించారు. సమీక్షల్లో ఎంపీ శ్రీ భరత్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌ రాజు, సీపీ శంఖబ్రత్‌ బాగ్చి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జేసీ విద్యాధరి, ఏపీఐఐసీ ఎండీ దినేష్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement