అల్లిపురం: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. శనివారం సౌత్ జోన్ పరిధిలో పర్యటించిన ఆయన వెలంపేటలో 177 గృహాల నిర్మాణ పనులు, ముడసర్లోవలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేసి, వేగం పెంచాలని సూచించారు. అలాగే సీఐఐ సదస్సు నేపథ్యంలో ఆర్.కె. బీచ్ రోడ్డులో చేపడుతున్న సుందరీకరణ పనులను సమీక్షించి, ఈనెల 12, 13 తేదీల్లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళల వసతి గృహాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.


