ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో వన్యప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని జూ అధికారులకు రాష్ట్ర అటవీ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాహుల్ పాండే సూచించారు. జూ పార్కును శనివారం ఆయన సందర్శించారు. అధికారులతో కలిసి వన్యప్రాణుల ఎన్‌క్లోజర్లు, వెటర్నరీ ఆస్పత్రి, ఇటీవల జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల ఏయే రకాల వన్యప్రాణులను ఏయే జూ పార్కుల నుంచి తీసుకొచ్చారు, వాటికి బదులుగా విశాఖ జూ నుంచి ఏయే జంతువులు, పక్షులను తరలించారు, ప్రస్తుతం ఎన్ని వన్యప్రాణులున్నాయి, జూలో సిబ్బంది పనితీరు తదితర విషయాల గురించి జూ క్యూరేటర్ జి.మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. వెటర్నరీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందులు, మూగజీవాలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జూలోని వివిధ విభాగాల్లో భద్రత కోసం కంచెలు ఏర్పాటు చేయాలని క్యూరేటర్‌కు సూచించారు. గోడలపై మెరుగుదల కోసం తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. జూ అసిస్టెంట్ క్యూరేటర్లు, జూ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సింహాన్ని దత్తత తీసుకున్న బాలుడు
నగరానికి చెందిన విఖ్యాత్ సిద్ధాన్ అనే బాలుడు తన పుట్టిన రోజు సందర్భంగా జూలో మగ సింహాన్ని మూడు నెలలకు దత్తత తీసుకున్నాడు. తన తల్లిదండ్రులతో కలిసి శనివారం జూ పార్కుకు వెళ్లి సింహానికి మూడు నెలల ఆహారం కోసం రూ.54,000 విరాళం అందించాడు. ఈ సందర్భంగా బాలుడిని రాహుల్ పాండే అభినందించి.. దత్తత ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కుమారుడిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


