రెక్కీ చేసి.. కట్టర్లు పెట్టి.. ఐఫోన్లు కొట్టేసి! | - | Sakshi
Sakshi News home page

రెక్కీ చేసి.. కట్టర్లు పెట్టి.. ఐఫోన్లు కొట్టేసి!

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

బీసీపీ మాల్‌ సెల్‌ పాయింట్‌ షోరూమ్‌లో

భారీ చోరీ కేసు ఛేదన

మూడు రోజుల ముందే రెక్కీ..

పక్కా ప్రణాళికతో దొంగతనం

ఇద్దరు అరెస్ట్‌.. బాలుడు అదుపులోకి

35 మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌

వస్తువులు స్వాధీనం

అల్లిపురం: పక్కాగా రెక్కీ నిర్వహించారు.. పథకం ప్రకారం తీవ్ర తుపాను రోజున రంగంలోకి దిగారు.. ఎలక్ట్రిక్‌ కట్టర్లతో తాళాలు కట్‌ చేసి షోరూమ్‌లోకి చొరబడ్డారు. ఐఫోన్లు, ఇతర బ్రాండెడ్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దోచుకెళ్లారు. అయితే సీసీ కెమెరాల నిఘా నుంచి తప్పించుకోలేక చివరకు పోలీసులకు చిక్కారు. డాబాగార్డెన్స్‌లోని బీసీపీ మాల్‌లో ఉన్న సెల్‌ పాయింట్‌ ఇండియా లిమిటెడ్‌ షోరూమ్‌లో జరిగిన భారీ చోరీ కేసును టూటౌన్‌ క్రైమ్‌ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు, నేరంలో పాల్గొన్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం టూటౌన్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర క్రైమ్‌ ఏడీసీపీ ఎన్‌.రమ్య, క్రైమ్‌ ఏసీపీ ఎ.వెంకటరావు, ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ క్రైమ్‌ సీఐ సీహెచ్‌ రాజులనాయుడు కేసు వివరాలు వెల్లడించారు.

స్నేహితులు.. సినిమా స్టైల్‌లో చోరీ!

ముగ్గురూ స్నేహితులు. వీరిలో చుక్క రవితేజ అలియాస్‌ పండు(20) ప్రధాన నిందితుడు. పాత నేరచరిత్ర ఉన్న ఇతడే మిగిలిన ఇద్దరినీ చోరీకి ప్రేరేపించాడు. అర్నబ్‌ తుపాను సమయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి పక్కా స్కెచ్‌ వేసుకున్నారు. అందుకు మూడు రోజుల ముందే షోరూమ్‌ పరిసరాలను పరిశీలించి రెక్కీ నిర్వహించారు. షోరూమ్‌లోకి ఎలా ప్రవేశించాలి.. ఏ మార్గంలో బయటకు వెళ్లాలనే విషయాలపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

కట్టర్లతో తాళాలు కట్‌ చేసి..

అర్నబ్‌ తుపాను రోజున భారీ వర్షం పడుతున్న సమయంలో పథకం ప్రకారం ఎలక్ట్రికల్‌ కట్టర్లతో సెల్లార్‌ గేట్‌, మెట్ల వద్ద ఉన్న గేట్‌ తాళాలు కట్‌ చేశారు. అనంతరం షోరూమ్‌ వెనుక వైపు ఉన్న గ్లాస్‌ డోర్‌ తాళాలను సైతం తొలగించి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న ఖరీదైన ఐఫోన్లు, ఇతర బ్రాండ్ల మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను మూటకట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

35 ఫోన్లు.. ఇతర వస్తువులు స్వాధీనం

నిందితుల నుంచి 25 ఐఫోన్లు, ఒక నథింగ్‌, రెండు రియల్‌మీ, రెండు శాంసంగ్‌, ఐదు వివో ఫోన్లు.. మొత్తం 35 మొబైల్‌ ఫోన్లతో పాటు ఆపిల్‌ వాచీలు, ఇయర్‌బడ్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించగా, బాలుడిని జువైనెల్‌ హోమ్‌కు పంపించారు.

ప్రధాన నిందితుడిపై పలు కేసులు

ప్రధాన నిందితుడు చుక్క రవితేజపై గతంలో ఎంవీపీ, ఆరిలోవ, భీమిలి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. హత్య కేసుతో పాటు చోరీ కేసుల్లోనూ ఇతడికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ తెరిచినట్లు తెలిపారు. సమావేశంలో టూటౌన్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సీహెచ్‌ చిరంజీవిరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సీసీ కెమెరాలతో చిక్కిన దొంగలు

చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. భీమిలి గొల్లతిమ్మాపురానికి చెందిన చుక్క రవితేజ అలియాస్‌ పండు (20), ఇసుకతోట రామాలయం వీధికి చెందిన కాపరపు దుర్గాప్రసాద్‌ (19)ను నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు నేరంలో పాల్గొన్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement