అగనంపూడి: విశాఖ నుంచి కేరళలోని కొల్లాం వరకు నేరుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధి కె.ఈశ్వర్ రైల్వే అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఈ–మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏటా వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు వెళ్తుంటారని తెలిపారు. విశాఖ నుంచి కొల్లాంకు నేరుగా రైళ్లు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి రైళ్లు మారాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాల్లో ప్రయాణించాల్సి రావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మాలధారణ సమయంలో నియమనిష్టలు పాటిస్తూ యాత్ర సాగించేందుకు నేరుగా రైలు సౌకర్యం ఎంతో అవసరమని తెలిపారు. రైల్వే బోర్డు, ఉన్నతాధికారులు స్పందించి విశాఖ–కొల్లాం మధ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


