నేడే పరిషత్‌ పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే పరిషత్‌ పోరు

Nov 5 2026 12:28 AM | Updated on Nov 5 2026 12:28 AM

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం(5న) జరగనున్న పరిషత్‌ పోరుకు సంబంధించి పోలింగ్‌, భద్రత, ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. నాలుగు(భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి) మండలాల పరిధిలో 4 జెడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలున్నాయి. పెందుర్తి మండల పరిధిలోని పెదగాడి ఎంపీటీసీ స్థానం ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో, మిగిలిన 52 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. 4 జెడ్పీటీసీ స్థానాల కోసం 13 మంది, 52 ఎంపీటీసీ స్థానాల కోసం 117 మంది బరిలో నిలిచారు. మొత్తం 1,62,407(పురుషులు 79,630, మహిళలు 82,777) మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 115 ప్రాంతాల్లోని 203 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్‌ జరగనుంది.

పోలింగ్‌ సామగ్రి పంపిణీ

ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,484 మంది సిబ్బందిని నియమించారు. బుధవారం ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల ద్వారా వీరికి ఎన్నికల సామగ్రి అందజేశారు. పెందుర్తిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆనందపురం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం, భీమిలిలోని సిద్ధార్థ పాఠశాల నుంచి పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో పోలింగ్‌ స్టేషన్లకు తరలివెళ్లారు.

16 జోన్లు.. 25 రూట్లు

పరిషత్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లాను 16 జోన్లుగా విభజించారు. పోలింగ్‌ సామగ్రి, సిబ్బంది సురక్షిత తరలింపు కోసం 25 ప్రత్యేక రూట్లను గుర్తించారు. 4 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ టీమ్‌లు, 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 4 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు, 2 వీడియో వీక్షణ బృందాలు, 5 ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు, 5 సింగిల్‌ విండో క్లియరెన్స్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు అందుబాటులోకి తెచ్చారు.

ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సామగ్రి పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు హాళ్లను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెందుర్తిలో జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, ఆనందపురంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, భీమిలిలో జనరల్‌ అబ్జర్వర్‌(జీసీసీ ఎండీ) శోభిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది రవాణా, కౌంటింగ్‌ టేబుళ్లు, భద్రత, మౌలిక సదుపాయాలను సమీక్షించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కౌంటింగ్‌ సమయంలో అభ్యర్థులు, వారి ఏజెంట్లకు నిబంధనల మేరకు వసతులు కల్పించాలని తెలిపారు. పోలింగ్‌ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అన్ని దశలను సమన్వయంతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో విశాఖ ఆర్డీవో దిలీప్‌ చక్రవర్తి, జిల్లా పరిషత్‌ సీఈవో నారాయణమూర్తి, స్పెషల్‌ ఆఫీసర్‌ ఉషారాణి, ఏసీపీ, స్థానిక తహసీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 4 జెడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జెడ్పీటీసీల బరిలో 13 మంది, ఎంపీటీసీల బరిలో 117 మంది 1,62,407 మంది ఓటర్లు, 203 పోలింగ్‌ కేంద్రాలు

నిరంతర పర్యవేక్షణకు వెబ్‌కాస్టింగ్‌

పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. 203 పోలింగ్‌ కేంద్రాల్లో 115 కేంద్రాల నుంచి జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు నేరుగా లైవ్‌ టెలికాస్ట్‌(వెబ్‌కాస్టింగ్‌) సౌకర్యం కల్పించారు. 93 సెన్సిటివ్‌ కేంద్రాల్లో 101 సీసీ సర్వైలెన్స్‌ ఏర్పాటు చేశారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లు

లెక్కింపు కేంద్రాలు

భీమిలి, పద్మనాభం మండలాలకు

సంబంధించి భీమిలిలోని ‘సీడార్‌’

(పాత ఏఎంజీ స్కూల్‌) ప్రాంగణం

ఆనందపురం మండలానికి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం

పెందుర్తి మండలానికి పెందుర్తి ప్రభుత్వ

జూనియర్‌ కళాశాల ప్రాంగణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement