డాబాగార్డెన్స్: విశాఖ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పటల్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సర్వీసులో ఉన్న అధికారులు, కార్మికులు, ఉద్యోగులు, సీహెచ్‌డీ కార్మికులు, క్యాజువల్ కార్మికులు, పూల్ కలాసీలు, రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరికాదని పేర్కొన్నారు.జగదాంబ సిటూ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గతంలో పీపీపీ విధానంలో హాస్పటల్‌ను అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 532 రోజుల పాటు నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం పీపీపీ విధానాన్ని ఉపసంహరించి ఓ అండ్ వీ విధానంలో నిర్వహించాలనే ప్రతిపాదన రావడంతో ఆందోళనలు విరమించామని చెప్పారు. ప్రస్తుతం మళ్లీ ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనిపై హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 6న టెండర్లు తెరవడానికి పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. హాస్పటల్ అభివృద్ధి పేరుతో 1.21 ఎకరాల ఆస్పత్రి, చుట్టుపక్కల ఉన్న 4.7 ఎకరాల స్థలం కలిపి మొత్తం 5.91 ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న మధ్యాహ్నం 12 గంటలకు పోర్టు ఏఓబీ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.సమావేశంలో ఏఐటీయూసీ నుంచి యు.పోతన్న, హెచ్‌ఎంఎస్ సీనియర్ నాయకుడు మంగయ్యనాయుడు, సిటూ గౌరవ అధ్యక్షుడు వీఎస్ పద్మనాభరాజు, సీఎఫ్‌టీయూఐ నుంచి సత్యనారాయణ, ఎన్‌పీటీ యూనియన్ జనరల్ సెక్రటరీ చందు, బీఎంఎస్ నుంచి గోపి, వీడీఎల్‌బీ యూనియన్ నుంచి ఎం. వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు


