ఎమ్మెల్యే పంచకర్ల దొంగ ఓటు! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పంచకర్ల దొంగ ఓటు!

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

ఓటు ఉన్న వార్డులో కాకుండా మరో వార్డులో ఓటు హక్కు వినియోగం

ఎమ్మెల్యే కావడంతో కళ్లు మూసుకుని బ్యాలెట్‌లు ఇచ్చేసిన అధికారులు

తన ఓటు టీడీపీకి వేయాల్సి ఉండగా జనసేన గుర్తు కనిపించినా ఆగని పంచకర్ల

చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు

పెందుర్తి: జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తన ఓటు హక్కును తప్పుడు రీతిలో వినియోగించి, అభాసుపాలయ్యారు. జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. తనకు ఓటు లేని చోట ఓటేసి అధికారులను, సిబ్బంది ఉద్యోగాలను ఇరుకున పెట్టారు. కూటమి పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడుస్తూ.. టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్న వార్డులో కాకుండా.. జనసేన అభ్యర్థి పోటీలో ఉన్న చోట ఓటు వేశారు. మరోవైపు లేని చోట ఎమ్మెల్యే తన అధికార దర్పంతో ఓటు వేయడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకే ముగిసినా రాత్రి 11 అయినా బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించలేదు. నిబంధనలు మీరి అదనపు ఓటు పడడంతో ఆ ఓటును లెక్కింపు రోజు పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

అసలేం జరిగింది?

పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సుజాతనగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇల్లు జీవీఎంసీ 117వ వార్డు పరిధిలోకి వచ్చింది. అదే వార్డు ఓటరు జాబితాలో ఎమ్మెల్యే, ఆయన సతీమణి ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆదివారం ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన పంచకర్ల నేరుగా 115వ వార్డులోని 8వ నంబర్‌ బూత్‌లోకి వెళ్లి ఓటేసేశారు. ఆయన ఓటేసేందుకు వెళ్లేటపుడు పీవో నాయుడు కనీస నిబంధనలు పాటించలేదు. ఎమ్మెల్యే వెళ్లగానే నేరుగా బ్యాలెట్లు ఇవ్వడంతో క్షణాల్లో పంచకర్ల ఓటు హక్కు వినియోగం జరిగిపోయింది.

వెన్నుపోటేనా!

ఎమ్మెల్యే పంచకర్ల ఓటు హక్కు ఉన్న 117వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి అవగడ్డ అప్పలనాయుడు(టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ సన్నిహితుడు) పోటీలో ఉన్నారు. ఆయన నిబంధనలు మీరి వినియోగించుకున్న 115వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు శానాపతి సోమశేఖర్‌ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఇష్టపడని పంచకర్ల ఉద్దేశపూర్వకంగానే తనకు ఓటు లేని చోట.. జనసేన అభ్యర్థి పోటీలో ఉన్న వార్డులో ఓటు వినియోగించుకున్నారని కూటమి నాయకుల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారులకు ముచ్చెమటలు

ఎమ్మెల్యే పంచకర్ల ఉద్దేశ్యపూర్వక తప్పిదంతో పీవో సహా సదరు బూత్‌లోని ఎన్నికల సిబ్బంది అంతా ఇరుకున పడ్డారు. బూత్‌ నెంబర్‌ 115/8లోని ఓటరు జాబితా ప్రకారం అసలు ఎమ్మెల్యేకు ఓటు హక్కు లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఓటుకు వచ్చారన్న అలవిమాలిన భక్తితో నేరుగా బ్యాలెట్‌లను అధికారులు ఇవ్వడం.. ఇదే అదను అని తన పార్టీకి చెందిన అభ్యర్థి బరిలో ఉన్న వార్డులో పంచకర్ల ఓటేయడం చకచకా జరిగిపోయాయి. అయితే పంచకర్ల మాయాజాలం కాసేపటికే బయటకు రావడంతో పీవో సహా ఇతర సిబ్బంది తలలు పట్టుకున్నారు. పోలింగ్‌ ముగిసి ఆరేడు గంటలైనా బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించలేదు. మరోవైపు జరిగిన ఘటనపై స్పందించేందుకు అధికారులు మీడియాకు ముఖం చాటేశారు. మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన ఓ ప్రజాప్రతినిధి తన ఓటునే అపహాస్యం చేసిన తీరుపై సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement