ద్వారకానగర్: ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అయితే ఆదివారం జరిగిన జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసుల వ్యవహారశైలి అనేక అనుమానాలకు, తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నేతలు హడావుడి సృష్టించినా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పక్ష నేతల విషయంలో ఒక రకంగా, ప్రతిపక్ష నేతల విషయంలో మరో రకంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ప్రజాస్వామ్యవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కూటమి నాయకులు హల్ చల్ చేసినా, పోలీసులు చోద్యం చూడటం వారి వైఫల్యానికి అద్దం పడుతోంది.
పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహం
అక్కయ్యపాలెం, మధురవాడ, భీమిలి తదితర ప్రాంతాల్లో కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారులను, పోలీసులను బెదిరించి తమ అభ్యర్థులకే ఓట్లు పడేలా చక్రం తిప్పారన్న విపక్షాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భీమిలిలో పోలీసులే స్వపక్ష నేతలకు కొమ్ముకాశారని ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధురవాడ వాంబే కాలనీలో పోలింగ్ ముగిసే సమయానికి కూటమి నేతలు సృష్టించిన ఉద్రిక్తతలపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక అక్కయ్యపాలెం బూత్ వద్ద తన ఓటును ఎవరో ముందే వేసేశారంటూ ఓ బాధితుడు కన్నీరుమున్నీరై నిరసన తెలపడం ఎన్నికల సిబ్బంది వైఫల్యానికి నిదర్శనం.
నిబంధనలు కాలరాసినా..
కూటమి నేతలు నిబంధనలను కాలరాస్తూ ఓటర్లను ప్రలోభపెట్టినా, బహిరంగంగా ప్రచారం చేసినా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. విపక్షాల పట్ల కఠినంగా, అధికార పక్షం పట్ల మెతక వైఖరితో వ్యవహరించారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సీపీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ బూత్ల వద్ద కూటమి నేతలు, అభ్యర్థుల భర్తల ఓవర్‌యాక్షన్‌తో ఘర్షణ వాతావరణం, తోపులాటలు చోటు చేసుకున్నా పోలీసులు కనీసం నియంత్రించలేని అసమర్థ స్థితిలో కూరుకుపోయారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఇంతటి ఉదాసీన వైఖరి ప్రదర్శించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పని విపక్ష నేతలు, ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.


