ఆనందపురం: మండలంలోని వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామం వైఎస్సార్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలుడు (14) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన గొలగాని గౌరీకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తేజ వెల్లంకి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా చదువుపై ఆసక్తి చూపకపోవడంతో కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు చదువుకోవాలని పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన తేజ రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో తల్లి ‘ఎప్పుడూ ఆటలేనా.. కాస్త చదువుకోవచ్చు కదా’ అని మందలించడంతో బాలుడు మనస్తాపానికి గురయ్యాడు. మేడ మీద అందరూ ఉన్న సమయంలో కింద ఉన్న గది ప్రధాన ద్వారానికి గడియ పెట్టి లోపలకి వెళ్లి సీలింగ్ హుక్‌కి చున్నీతో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లి గమనించి, చుట్టుపక్కల వారి సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు భీమిలి సీహెచ్‌సీ వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


