సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజూ ఉప్పొంగిన ప్రజాభిమానంతో వైఎస్సార్ సీపీ హోరెత్తింది. యువత, మహిళల నుంచి వృద్ధుల వరకు ప్రచారంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి కుంకుమ దిద్ది సాధరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి ఎన్నికల ప్రచారానికి పౌరుల నుంచి విశేష స్పందన లభించింది. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో శుక్రవారం 24, 27, 28 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. అలాగే, విశాఖ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో 31, 32, 33, 34, 35, 39, 36, 37, 38, 41, 43, 42 వార్డుల్లో ప్రచారం సాగింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హోటల్ ఓషన్ విస్తా బేలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
54వ వార్డులో కన్నబాబు, అమర్‌నాథ్, కేకే రాజు
ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 54వ వార్డు వైఎస్సార్ నగర్, సత్యసాయినగర్, నరసింహనగర్, సీతమ్మధార, బిలాల్ కాలనీలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రీజనల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణిని, 54వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాసరావును గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. అదేవిధంగా 59, 53, 56, 55 వార్డులలో కేకే రాజు ప్రచారంలో పాల్గొని, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు.


