రూ.66 లక్షల విలువైన రూ.500 నోట్ల కలర్ జిరాక్స్ కాపీలు స్వాధీనం
జగదాంబ జంక్షన్‌లోని హోటల్‌పై
మహారాణిపేట పోలీసుల దాడి
నలుగురి అరెస్ట్..
మరో ముగ్గురి కోసం గాలింపు
13,200 నకిలీ నోట్ల కాపీలు,
డమ్మీ తుపాకీ స్వాధీనం
అల్లిపురం: జీవీఎంసీ ఎన్నికల వేళ విశాఖ నగరంలో నకిలీ నోట్ల కలర్ జెరాక్స్ కాపీలు కలకలం రేపాయి. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో జగదాంబ జంక్షన్ సమీపంలోని వీ–స్టార్ హోటల్‌లో రూ.66 లక్షల విలువైన రూ.500 నోట్ల జెరాక్స్ కాపీలు పట్టుబడ్డాయి. వీటితో పాటు డమ్మీ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో ఈస్ట్ సర్కిల్ ఏసీపీ లక్ష్మణమూర్తి, సీఐ గోవిందరావు వివరాలు వెల్లడించారు.
హోటళ్లలో తనిఖీలతో వెలుగులోకి.. : నగరంలోని హోటళ్లు, లాడ్జీల్లో పోలీసుల తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వీ–స్టార్ హోటల్‌లోని 105వ గదిలో నలుగురి బ్యాగులను పరిశీలించగా.. ఒక బ్యాగులో రూ.500 నోట్ల జెరాక్స్ కాపీలతో కూడిన 200 కట్టలు లభించాయి. ఒక్కో కట్టలో 66 చొప్పున మొత్తం 13,200 నోట్ల కాపీలు ఉన్నాయి. వీటి విలువ రూ.66 లక్షలుగా పోలీసులు గుర్తించారు. మరో బ్యాగులో డమ్మీ తుపాకీ లభించింది.
నలుగురు అదుపులోకి.. మరో ముగ్గురు పరారీ
పోలీసుల అదుపులో ఉన్నవారిని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం డోమలజోరు గ్రామానికి చెందిన పాంగి కొండబాబు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బేవర సాయి, సాలూరు పెద్దవీధికి చెందిన ఇజ్జవరపు దుర్గాప్రసాద్, ఎస్.పెద్దవలస గ్రామానికి చెందిన వెలగడ దినేష్‌గా గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇన్‌స్ట్రాగామ్ పరిచయాలతో మోసం : ఏడుగురు నిందితులు మూడు నెలల క్రితం ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమై ఈ దందా ప్రారంభించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న చందు కలర్ జెరాక్స్ నోట్లు తయారు చేయించడం, వాటితో మార్పిడికి ఆసక్తి చూపేవారిని గుర్తించడం చేసేవాడని పోలీసులు తెలిపారు. మిగిలిన వారు పరిసరాలను గమనిస్తూ, నోట్ల మార్పిడికి సహకరించేవారని, ఇందుకు వారికి డబ్బులు ఇచ్చేవారని వెల్లడించారు.
విజయనగరం, విశాఖలోనూ దందా : విజయనగరం, విశాఖ ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ నోట్ల కాపీలు ఎక్కడ తయారవుతున్నాయి? వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.


