విశాఖను
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే విశాఖను ‘ఫ్యూచర్ ఆఫ్ ఏపీ’గా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హామీ ఇచ్చారు. నగరంలోని ప్రముఖులు, విద్యావేత్తలతో చర్చించి వారి సలహా సూచనలతో విశాఖను కేవలం ‘నేచర్ సిటీ’గానే కాకుండా, అభివృద్ధి చెందిన ‘ఫ్యూచర్ సిటీ’గా మారుస్తామన్నారు. శుక్రవారం విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి ఆమె ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలకు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. విశాఖ అంటే పాతకాలపు మున్సిపాలిటీ కాదని, దానికో అంతర్జాతీయ విలువ ఉందని చెప్పారు. విశాఖ బ్రాండ్‌కు మరిన్ని కొత్త విలువలను జోడించాల్సి ఉండగా.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరంపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అద్భుతమైన సముద్రతీరం, పచ్చని కొండలు కలిగిన ఈ నగరానికి మరింత వన్నె తెచ్చి.. ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. టీడీపీ గతంలో ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత చెత్తబుట్టలో వేసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇప్పుడు ఇచ్చే జీవీఎంసీ మేనిఫెస్టోను కూడా గెలిచాక అలాగే చెత్తబుట్టలో వేస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ దోపిడీ పాలన నుంచి విశాఖను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.


