పద్మనాభం: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కక్షతో ఓ వ్యక్తి వృద్ధుడిని కర్రతో తలపై కొట్టి హత్య చేసిన ఘటన పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎం.చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. శేరిఖండం గ్రామానికి చెందిన సంగం అప్పలరాజు రెడ్డిపల్లిలోని పల్లంటి చిన్నారావుకు చెందిన సామిల్లులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాము సామిల్లు సమీపంలో ఒంటరిగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రాము తరచూ సామిల్లు వద్దకు వెళ్లి అప్పలరాజు, యజమాని చిన్నారావులను డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. అయితే అప్పలరాజు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు సామిల్లు వద్దకు రావొద్దని రామును గట్టిగా హెచ్చరించాడు. దీంతో అప్పలరాజుపై రాము కక్ష పెంచుకున్నాడు.
తలపై కర్రతో.. : ఈ క్రమంలో గురువారం రాత్రి సామిల్లు వద్దకు వెళ్లిన రాము.. మంచంపై ఉన్న అప్పలరాజు తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో అప్పలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సామిల్లులో పనిచేసే గుమస్తా శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లగా.. అప్పలరాజు మంచంపై రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడు రామును శుక్రవారం రేవిడిలో గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.


